
-
నేపాల్‌లో ఏం జరుగుతోందో గమనించండి
న్యూఢిల్లీ: ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశ రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నట్టు తెలిపింది. మన పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లలో ఏం జరుగుతోందో ఒకసారి గమనించాలని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్‌కు గడువు నిర్దేశించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయం కోరగా.. సీజేఐ జస్టిస్ బీఆర్గవాయ్ బెంచ్ ముందు బుధవారం (సెప్టెంబర్ 10) వాదనలు కొనసాగాయి.
ఈ బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ గవాయ్.. భారత రాజ్యాంగాన్ని ప్రస్తాంచారు. ‘‘మన రాజ్యాంగం చూసి గర్వపడుతున్నాం. మన పక్కనున్న దేశాల్లో ఏం జరుగుతోందో చూడండి. ఇప్పుడు నేపాల్‌లో పరిస్థితిని గమనించండి’’ అన్నారు. మధ్యలో జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పందించి ‘‘అవును.. బంగ్లాదేశ్‌లోనూ’’ అంటూ గుర్తు చేశారు.
వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ బెంచ్ ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బిల్లులను నెలకు పైగా రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్ల అధికారాలను సమర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అన్ని బిల్లులలో 90% బిల్లులను ఒక నెలలోపు గవర్నర్ ఆమోదిస్తారని ప్రకటించారు. 1970 నుంచి 2025 వరకు తమిళనాడు గవర్నర్ రవి ఆలస్యం చేసిన 7 బిల్లులుసహా 20 మాత్రమే రిజర్వ్‌లో ఉన్నట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
జస్టిస్ నాథ్ స్పందిస్తూ.. ఎన్ని బిల్లులు ఆమోదించినా లేదా నిలిపివేసినా దేశం గత 75 ఏండ్లుగా సజావుగానే నడుస్తున్నదన్నారు. కాగా, ‘మేం గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే ఇవి రాష్ట్రపతి సూచనను వ్యతిరేకించే రాష్ట్రాలకు న్యాయం చేయలేవు’ అని సీజేఐ అన్నారు. అయితే, ప్రజలను ప్రభావితంచేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు.
రాజ్యాంగ విరుద్ధమైనా.. బిల్లులను ఆపొద్దు
శాసన సభ ఆమోదించి పంపిన బిల్లులను అవి రాజ్యాంగ విరుద్ధమైనా.. కేంద్ర చట్టానికి వ్యతిరేకమైనా నిలిపివేసే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టుకు 4 ప్రతిపక్ష రాష్ట్రాలు తెలిపాయి. గవర్నర్‌కు విస్తృతమైన విచక్షణాధికారాలు ఇవ్వడం వల్ల ద్వంద్వ పాలన ఏర్పడుతుందన్నాయి. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై బుధవారం సుప్రీంకోర్టులో కర్నాటక, పంజాబ్, కేరళ, తెలంగాణ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
శాసనసభ ఆమోదించిన బిల్లులు ప్రజల ఇష్టానికి ప్రతీక అని, కాబట్టి రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఆ బిల్లులను ఒక్కసారి సలహాలతో శాసనసభకు తిరిగి పంపవచ్చని చెప్పారు. రాష్ట్రపతిలాగే.. గవర్నర్ కూడా మంత్రి మండలి సలహాలకు కట్టుబడి ఉండాలన్నారు. బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేందుకు గడువు కచ్చితంగా ఉండాల్సిందేనని కర్నాటక వాదించింది. ప్రాసిక్యూషన్అనుమతి ఇవ్వడంలో గవర్నర్ సాధారణంగా మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరించాలనితెలంగాణ తరఫున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదించారు.