టీకా వేసినంకనే స్కూల్​కు పంపుతం

టీకా వేసినంకనే స్కూల్​కు పంపుతం
  • లోకల్‌‌ సర్కిల్స్‌‌ సర్వేలో 48%  మంది పేరెంట్స్​ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తుండటం.. డెల్టా, డెల్టా ప్లస్‌‌‌‌ లాంటి వేరియంట్లు వస్తుండటంతో చిన్నారులను ఫిజికల్‌‌ క్లాసులకు పంపేందుకు ఇంట్రస్ట్‌‌ చూపిస్తలేరు. 78 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపేందుకు భయపడుతున్నారు. పిల్లలకు టీకా వేసే దాకా స్కూళ్లకు పంపబోమని మరికొందరు చెబుతున్నారు. 21 శాతం మందే చిన్నారులను స్కూళ్లకు పంపేందుకు రెడీగా ఉన్నారు. కొన్ని షరతులతో రీ ఓపెన్‌‌ చేస్తే పంపిస్తామని 41 శాతం మంది చెప్పారు. లోకల్‌‌ సర్కిల్స్‌‌ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 361 జిల్లాల్లో నిర్వహించిన ఈ ఆన్‌‌లైన్‌‌ సర్వేలో 32 వేల మంది పేరెంట్స్‌‌ ఫీడ్‌‌బ్యాక్‌‌ తీసుకున్నారు. ఇందులో 68 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు ఉన్నారు.

కేసుల భయంతో..
దేశంలో కిందటి ఏడాది కరోనా విజృంభించడంతో అంతటా ఆన్‌‌లైన్‌‌ క్లాసులు కొనసాగాయి. ఈ ఏడాది కూడా ఒకట్రెండు నెలలు మినహా మళ్లీ ఆన్‌‌లైన్‌‌ క్లాసులే జరుగుతున్నాయి. కరోనా భయంతో ఫిజికల్‌‌ క్లాసులు నిర్వహించట్లేదు. ఊర్లల్లో ఇంటర్‌‌నెట్‌‌ సమస్యలు.. స్మార్ట్‌‌ ఫోన్లు, ల్యాప్‌‌ట్యాప్స్‌‌ లాంటివి అందుబాటులో లేకపోవడంతో ఆన్‌‌లైన్‌‌ క్లాసులకు ఇబ్బందులు ఎదువుతున్నాయి. ఇంట్లో ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే చదువుకు కష్టాలు తప్పట్లేదు. ఫిజికల్‌‌ క్లాసుల్లేక పిల్లలపై ఫిజికల్‌‌గా, మెంటల్‌‌గా ప్రభావం పడుతోంది. దేశంలోని 8 రాష్ట్రాలే పైతరగతుల విద్యార్థుల కోసం విద్యాసంస్థలను రీ ఓపెన్‌‌ చేశాయి. కొంతకాలంగా దేశంలో కేసులు తక్కువే నమోదవుతున్నా కొన్ని జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. దేశంలోని 54 జిల్లాల్లో 10 శాతం పాజిటివ్‌‌ రేట్‌‌ ఉందని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా డెల్టా, డెల్టా ప్లస్‌‌ లాంటి వేరియెంట్ల వార్తలతో పేరెంట్స్‌‌ భయపడుతున్నారు.

వేరియంట్లు పెరుగుతుండటంతో..
మున్ముందు పిల్లలు ఫిజికల్‌‌ క్లాసులకు వెళ్లాలంటే వ్యాక్సిన్‌‌ కీలకం కానుంది. కరోనా కొత్త వేరియెంట్లు పెరగడం, పిల్లలపై ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయనే వార్తలతో టీకాలపై తల్లిదండ్రులు ఇంట్రస్ట్‌‌ చూపిస్తున్నారు. పిల్లలకు వ్యాక్సిన్‌‌ ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ఇటీవల కేంద్ర హెల్త్‌‌ మినిస్టర్ మన్సుఖ్‌‌ మాండవీయ వెల్లడించారు. గుజరాత్‌‌కు చెందిన జైడస్‌‌ కాడిలా కంపెనీ జైకోవ్‌‌-డి అనే వ్యాక్సిన్‌‌ను 12 ఏండ్లు పైబడిన వారి కోసం తయారు చేసింది. ఇతర కంపెనీలూ పిల్లలపై ట్రయల్స్‌‌ జరుపుతున్నాయి. వీటికి అప్రూవల్స్‌‌ రావాల్సి ఉంది.

కండీషన్స్‌‌తో 41 శాతం మంది రెడీ
కొన్ని కండీషన్స్‌‌తో ప్రభుత్వాలు ఫిజికల్‌‌ క్లాసులను రీ ఓపెన్‌‌ చేస్తే పంపేందుకు కొందరు పేరెంట్స్‌‌ ముందుకొస్తున్నారు. కరోనా ప్రొటోకాల్స్‌‌, 50 శాతం కెపాసిటీ పాటిస్తే తరగతులకు పంపిస్తామని 41శాతం మంది చెబుతున్నారు. 52 శాతం మంది తల్లిదండ్రులు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. 7 శాతం మంది ఎలాంటి ఒపీనియన్‌‌ చెప్పలేదు. 

21 శాతం మంది పేరెంట్స్​ స్కూళ్లకు పంపేందుకు రెడీ
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను ఫిజికల్‌‌ క్లాస్‌‌లకు పంపిస్తారా అని అడగ్గా 21% మంది పేరెంట్స్‌‌ ‘మేము సిద్ధం’ అని చెప్పారు. తమ జిల్లాలతో పాటు పక్క జిల్లాల్లోనూ కరోనా కేసులు జీరో అయ్యే దాకా పిల్లల్ని పంపబోమని 30 శాతం మంది తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. వ్యాక్సిన్‌‌ వేసేదాకా ఫిజికల్‌‌ క్లాస్‌‌లకు పంపబోమని 48 శాతం మంది క్లియర్‌‌గా చెప్పారు. ఒక శాతం మంది ఎలాంటి ఒపీనియన్‌‌ చెప్పలేదు. మొత్తంగా 78 శాతం మంది పేరెంట్స్‌‌ తమ పిల్లలను ఫిజికల్‌‌ క్లాసులకు పంపేందుకు ఇంట్రెస్ట్‌‌ చూపించడం లేదని సర్వేలో తేలింది. ఇదే సంస్థలో జూన్‌‌లో చేసిన సర్వేలో 37శాతం మంది వ్యాక్సిన్‌‌ వేయించాక పంపిస్తామన్నారు. ఇప్పుడు అది 48 శాతానికి పెరిగింది.