ఓవల్‌‌లో మనమే బెస్ట్‌‌

ఓవల్‌‌లో మనమే బెస్ట్‌‌

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ను అలరించిన ఐపీఎల్‌‌ ముగియడంతో ఇప్పుడు అందరూ ప్రతిష్టాత్మక వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌‌పై దృష్టి పెట్టారు. సౌత్‌‌ లండన్‌‌లోని ఓవల్‌‌ వేదికగా ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగే ఈ మెగా మ్యాచ్‌‌లో ఇండియా, ఆస్ట్రేలియా గద కోసం ఫైట్‌‌ చేయనున్నాయి. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌, ప్లేయర్లు, రికార్డుల విషయంలో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నా.. ఒక్క విషయం మాత్రం ఆసీస్‌‌ను కంగారుపెడుతున్నది. 

38లో ఏడు గెలిచారు..

ఇంగ్లండ్‌‌లో ఉన్న గ్రౌండ్స్‌‌లో ఆస్ట్రేలియాకు అతి తక్కువ సక్సెస్‌‌ రేట్‌‌ ఓవల్‌‌లో ఉండటం ఇప్పుడు కంగారూలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. 1880 నుంచి మొదలు పెడితే ఈ వేదికపై ఆసీస్‌‌ ఆడిన 38 మ్యాచ్‌‌ల్లో కేవలం ఏడింటిలో మాత్రమే గెలిచింది. సక్సెస్‌‌ రేట్‌‌ కేవలం 18.42గా ఉంది. గడిచిన 50 ఏళ్లలో ఇక్కడ రెండు మ్యాచ్‌‌లు మాత్రమే నెగ్గింది. దీంతో ఇప్పుడు రోహిత్‌‌సేన జోరును ఎలా అడ్డుకోవాలన్న దానిపై కసరత్తులు ప్రారంభించింది. లార్డ్స్‌‌లో 29 మ్యాచ్‌‌ల్లో 43.59 శాతం విజయాల రేట్‌‌తో 17 విక్టరీలు అందుకున్నారు. ఈ వేదికలో ఇంగ్లండ్‌‌ 141 మ్యాచ్‌‌ల్లో విజయాల శాతం 39.72 ఉండగా, సౌతాఫ్రికా 33.33 శాతంతో ఉంది. హెడ్డింగ్లీలో ఆసీస్‌‌ 34.62 శాతం, ట్రెంట్‌‌ బ్రిడ్జ్‌‌లో 30.43 శాతం, ఓల్డ్‌‌ ట్రాఫోర్డ్‌‌ , ఎడ్జ్‌‌బాస్టన్‌‌లో వరుసగా 29.03, 26.67 శాతంగా ఉన్నాయి. దీంతో ఆసీస్‌‌ మాజీలందరూ ఈ రికార్డులను చూసి ఓవల్‌‌లో తమ జట్టు గెలుస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్స్‌‌ కోసం ఆసీస్‌‌ ప్లేయర్లందరూ ప్రాక్టీస్‌‌ను ముమ్మరం చేశారు. బెకెన్‌‌హామ్‌‌ గ్రౌండ్‌‌లో బ్యాటింగ్​ ప్రాక్టీస్‌‌ చేస్తున్నారు. 

14లో రెండు గెలిచాం..

ఇక ఓవల్‌‌ గ్రౌండ్‌‌లో మన రికార్డు కూడా బాగా లేకపోయినా ఆసీస్‌‌తో పోలిస్తే కాస్త బెటర్‌‌గానే ఉంది. ఇక్కడ ఆడిన 14 మ్యాచ్‌‌ల్లో టీమిండియా రెండింటిలో గెలవగా ఏడు డ్రాలు చేసుకుంది. మరో ఐదింటిలో ఓడింది. లేటెస్ట్‌‌గా 2021లో ఇంగ్లండ్‌‌పై 157 రన్స్‌‌ తేడాతో గెలవడం రోహిత్‌‌ సేనకు ఉత్సాహాన్నిచ్చే అంశం. ఇక్కడి కండిషన్స్‌‌కు బాగా అలవాటు పడిన మన టీమ్‌‌ బౌలింగ్‌‌లో పైచేయి సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 పేసర్లకు అనుకూలం..

ఓవల్‌‌ కండిషన్స్‌‌ బట్టి పిచ్‌‌ కంప్లీట్‌‌గా పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. దీంతో ఆసీస్‌‌ ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగే చాన్స్‌‌ ఉంది. కానీ ఇండియా మాత్రం నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏకైక స్పిన్నర్‌‌గా అశ్విన్‌‌, జడేజాలో ఎవరికి ఓటు వేస్తారో చూడాలి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను ఆసీస్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌తో ముగించినా.. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో ఇండియా చేతిలో 2–1 తేడాతో ఓడటం వాళ్లకు మైనస్‌‌గా మారింది.