- సీజేపీ కార్యకర్తల మీద పోలీసుల దాడి పిటిషన్‌పై సీజేఐ ఆగ్రహం
- 2 నెలల క్రితం ఆయన చేసిన ‘కాక్రోచ్’ కామెంట్లతో దుమారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలను చూడాలని, ఈ అంశాన్ని సుమోటోగా అత్యవసర విచారణకు స్వీకరించాలన్న లాయర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
‘‘మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయవద్దు. మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు. వాటిని చూడటానికి మా వద్ద సమయం కూడా లేదు. మెన్షనింగ్ దశలో ఎలాంటి వీడియో ఫుటేజ్‌ను పరిశీలించడానికి మేం సిద్ధంగా లేం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
న్యాయవాది నరేంద్ర మిశ్రా బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరుల ప్రాథమిక హక్కులను ఢిల్లీ పోలీసులు ఉల్లంఘించారని, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.
‘‘విద్యార్థులపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఆధారాలు నా వద్ద ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఈ అంశాన్ని గురువారం నాడే అత్యవసరంగా విచారణకు స్వీకరించండి” అని కోరారు. అయితే, ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, పిటిషనర్ విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు.
రెండు నెలల క్రితం ‘కాక్రోచ్’ కామెంట్లతో దుమారం
గత మే నెలలో సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. న్యాయవాదుల హోదాకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉపాధి దొరకక, వృత్తిలో స్థానం లేక బొద్దింకలలా తిరిగే యువత కొందరు ఉన్నారు. వారు సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడులు చేస్తూ ‘పారాసైట్స్(పరాన్నజీవులు)’గా మారుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’ ఆవిర్భవించింది. కొద్దిరోజుల్లోనే సీజేపీ పాపులర్ కావడంతో, తన వ్యాఖ్యలపై సీజేఐ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం తప్పుగా చిత్రీకరించిందని పేర్కొన్నారు. యువతను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, బోగస్, నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తి, ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్న వారిని మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు.
