టీఆర్ఎస్ వాళ్లకే దళిత బంధు ఇచ్చుకుంటం

టీఆర్ఎస్ వాళ్లకే  దళిత బంధు ఇచ్చుకుంటం
  • మీకియ్యం... ఏం చేసుకుంటరో చేస్కోండి
  • కవ్వ గూడ సర్పంచ్ పక్షపాత వైఖరి
  • పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన దళితులు

రంగారెడ్డి : ‘మా పార్టీ వాళ్లకే దళిత బంధు ఇచ్చుకంటం... వేరే పార్టీ వాళ్లకు ఇవ్వం.. మా ముఖ్యమంత్రి కేసీఆర్ మా కోసం డబ్బు పంపుతుండు..మీకెందుకియ్యాలె’ అంటూ ఓ టీఆర్ఎస్ సర్పంచ్ దళితులపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన దళితులు  గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వ గూడలో జరిగింది. గ్రామంలోని కొంతమంది దళితులు గ్రామ సర్పంచ్ రమేశ్ ను కలిసి..దళిత బంధు పథకం కోసం అర్హులైన వారినే ఎంపిక చేయాలని కోరారు. కానీ ఆ సర్పంచ్ ‘మా పార్టీ వాళ్లకే దళిత బంధు ఇస్తం..వేరే పార్టీ వాళ్లకు ఇవ్వం.. మీరెందుకు వచ్చారు? ..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’అంటూ వారిపై విరుచుకుపడ్డాడు. సర్పంచ్ తీరుతో షాక్ కు గురయ్యారు దళితులు.సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు. పార్టీలకతీతంగా అర్హులైన వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వం చెబుతుంటే.. టీఆర్ఎస్ వాళ్లకే ఇచ్చుకుంటామని ఎలా చెబుతారని సర్పంచ్ ను నిలదీశారు. అయిన అతడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే ట్యాక్స్ తోనే ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని, ఇందులో పార్టీలకు చోటు లేదన్నారు. సర్పంచ్ వ్యవహారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్, సాయి, నరసింహ రఘు, శ్రీ రాములు, సురేష్, దర్శన్, సిద్ధులు, నందం గణేష్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్