నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

హైదరాబాద్ : రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పజెప్పి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. లంగర్హౌస్ కు చెందిన మీర్జా సుల్తాన్ బేగ్, సమీరాబేగం దంపతులు మెహిదీపట్నంలో బంగారు నగలు కొనుగోలు చేశారు. అనంతరం తమ బైక్పై లంగర్హౌస్కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యంలో నగలున్న బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లాక ఆ విషయాన్ని గమనించిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. 

ఇదిలా ఉంటే ఆసిఫ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్కు పిల్లర్ నెంబర్ 55 వద్ద ఓ బ్యాగు దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దాదాపు రూ.5లక్షల విలువైన 10తులాల బంగారు నగలు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ బంగారు ఆభరణాలను పోలీసులకు అందజేశాడు. అప్పటికే బాధితులు తమ బంగారు ఆభరణాలున్న బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ సమక్షంలో బాధితులకు బంగారు నగలను అందజేశారు. నిజాయితీతో వ్యవహరించిన ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్ను పోలీసులు సన్మానించారు.