కేసీఆర్​ను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్టే..

కేసీఆర్​ను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్టే..

మెదక్ (కౌడిపల్లి), వెలుగు : పేదలకు ఇచ్చిన హామీలో భాగమైన డబుల్​బెడ్​రూం ఇండ్ల విషయంలో తాము ఫెయిలయ్యామని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి అంగీకరించారు. బుధవారం కౌడిపల్లి మండలం నాగ్​సాన్​పల్లిలోని నర్సింగారావు ఫంక్షన్ హాల్​లో కొత్తగా ఆసరా పింఛన్​ మంజూరైన లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఫెయిల్ అయ్యాము కానీ, సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షలు అందజేస్తామన్నారు. పేదల బాగు కోసం సీఎం కేసీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఏ ముఖ్యమంత్రి చేయని పనులు ఆయన చేస్తున్నారన్నారు. ఆయనను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్టేనని అన్నారు.  

కన్నీరు పెట్టిన సర్పంచ్ భర్త 

కాగా, ఈ సభలో సర్పంచ్ నాజియా భర్త సలీముద్దీన్ కంటతడి పెట్టారు. గ్రామంలో పనులు చేస్తే ఇప్పటివరకు బిల్లులు రాలేదన్నారు. ఊర్లో రోడ్లు, గ్రామానికి వచ్చే రోడ్డు, సంఘాల బిల్డింగులు, స్కూల్​ శిథిలావస్థకు చేరాయని ఎమ్మెల్యే దృష్టికి తెస్తూ ఏడ్చారు. గ్రామస్థులతో మాట పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఎంతో కష్టపడ్డామని అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నామని, ఇప్పటికైనా స్పందించకపోతే రాజీనామా చేస్తామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే వెంకట్రావుపేట్ లో రోడ్డు నిర్మాణానికి రూ.కోటి, బిల్డింగులకు రూ.50 లక్షలు మంజూరు చేస్తానన్నారు.