మహదేవపూర్, వెలుగు : రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇందిరమ్మ ఇండ్లను, పంచాయతీ భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు ఉండదన్నారు.
అవినితికి తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. రెండో విడత ద్వారా అర్హులైన పేదలకు పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్ పాల్గొన్నారు.
