హైదరాబాద్: శాస్త్రీయంగా సర్వేలు చేసి, అభ్యర్థుల విజయావకాశాలను అంచనా వేసి అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముందే హామీలు ఇవ్వడం అనేది ఉండదని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్లో భట్టి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏదీ నెరవేరలేదు. నా పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నో కళ్లారా చూశా. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అవేవీ కనిపించడం లేదు. రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుతో ఉంది.
వరదలు, విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం స్తబ్దుగా ఉండిపోయింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అశాస్త్రీయంగా ప్రాజెక్టులు కడుతున్నారు. కాళేశ్వరం అలాగే కట్టారు. సీతారామ సాగర్ అలాగే కడుతున్నారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక కాంగ్రెస్లోకి వస్తున్నారు. మా పార్టీ వ్యక్తులపై కాదు, సిద్ధాంతం మీద నడుస్తోంది.
శాస్త్రీయంగా సర్వేలు చేసి, అభ్యర్థుల విజయావకాశాలను అంచనా వేసి అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుంది. ముందే హామీలు ఇవ్వడం అనేది ఉండదు. షర్మిల చేరిక మీద వార్తలు నేనూ చూశాను. అంతకు మించి సమాచారం లేదు. అధిష్టానం చూసుకుంటుంది’ అని విక్రమార్క తెలిపారు.
