
- పోలింగ్ పూర్తయ్యే దాకా అలర్ట్‌గా ఉండాలి
- ఎలక్షన్ వార్‌రూమ్ ఇన్‌చార్జ్‌లకు కేటీఆర్, హరీశ్ దిశానిర్దేశం
బీఆర్ఎస్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, వార్‌రూమ్ ఇన్‌చార్జ్‌లు సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ కావాలని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సూచించారు. ఆదివారం జల విహార్‌లో పార్టీ స్టేట్ వార్రూమ్ఇన్చార్జ్లు, స్టార్ క్యాంపెయినర్లు, నియోజకవర్గాల ప్రచార ఇన్‌చార్జ్‌లతో వారిద్దరూ సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం గురించి దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రామ స్థాయిలో పార్టీ వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. వాటిలో ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన ప్రచార పోస్టింగ్‌లు పెట్టాలి. ప్రజల్లోకి బీఆర్ఎస్ మేనిఫెస్టోను తీసుకెళ్లాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక వార్రూమ్ఏర్పాటు చేశాం. దాన్ని మానిటర్ చేయడానికి హైదరాబాద్‌లో సెంట్రల్ వార్ రూమ్ అందుబాటులోకి తీసుకువచ్చాం” అని చెప్పారు. వార్ రూమ్ కేంద్రంగా 380 మంది ఎప్పటికప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకొని, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అప్రమత్తం చేస్తారని తెలిపారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో బ్రోచర్లను ప్రతి గడపకు చేర్చాలని, ప్రతి ఓటరును స్థానిక ఇన్‌చార్జ్‌లు వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఏం చేసిందో చెప్పాలని, మళ్లీ గెలిపిస్తే ఏం చేయబోయేది వివరించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టండి
‘‘తమ గ్యారంటీలను బీఆర్ఎస్ కాపీ కొట్టిందంటూ కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి. కేసీఆర్ పథకాలనే కాంగ్రెస్ కాపీ కొట్టి గ్యారంటీల పేరుతో ఇచ్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించండి. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయండి” అని కేటీఆర్ సూచించారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్‌షాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలన్నారు. నరేంద్ర మోదీని సోషల్‌మీడియానే గుజరాత్ సీఎం నుంచి దేశ ప్రధాని స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. సోషల్ మీడియా ఉధృతి కొన్నేళ్లలోనే పెరిగిందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాళ్లు.. ఈ కొత్త ఎన్నికల ప్రచార సరళికి అలవాటు పడటం లేదని, వెంటనే సోషల్‌మీడియా క్యాంపెయినింగ్ను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో పోలింగ్‌బూత్‌ను 8 నుంచి 10 కమిటీలుగా విభజించి వంద మంది ఓటర్లకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీకి ఉన్న సానుకూలతలు, ప్రతికూల అంశాలను ఎప్పటికప్పుడు వార్‌రూమ్‌కు తెలియజేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ నియమాలకు లోబడే ప్రచారం సాగాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయ సంబంధ వివాదాల్లో చిక్కుకోవద్దన్నారు. స్టేట్ వార్‌రూమ్‌లో లీగల్ఎక్స్పర్టులు అందుబాటులో ఉంటారని, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
కొంత వెనకబడ్డాం: హరీశ్‌రావు
బీఆర్ఎస్ మేనిఫెస్టో, ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని అన్ని సర్వేలు చెప్తున్నాయని, ఇంకో నెల రోజులు అందరం సీరియస్‌గా కష్టపడుదామని సూచించారు. ‘‘మన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనకబడ్డాం. పద్ధతి ప్రకారం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2009లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇప్పుడు ఆరు గ్యారంటీల పరిస్థితి కూడా అదేనని ప్రజలకు వివరించాలి. పోడు సమస్యను పరిష్కరించాం. తండాలను గ్రామ పంచాయతీలు చేశాం. దేశానికే ఆదర్శవంతమైన ఎన్నో పథకాలను మన ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందనే విషయం ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో కూడిన బ్రోచర్‌ను ప్రతి ఓటరుకు అందజేయాలి. ఈ స్టిక్కర్లు ప్రతి ఇంటికి అతికించాలి” అని చెప్పారు.