రాష్ట్రంలోకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తున్నాం : షర్మిల

రాష్ట్రంలోకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తున్నాం : షర్మిల
  • ఆయన రాకను స్వాగతిస్తున్నాం: షర్మిల
  • తామే కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతున్నామని కామెంట్

నిర్మల్/ఖానాపూర్, వెలుగు : రాష్ట్రంలోకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తున్నామని, కాళేశ్వరం  ప్రాజెక్టు అవినీతిపై రాహుల్  ప్రశ్నించాలని వైయస్సార్ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. ఈ మేరకు రాహుల్ కు ఆమె బుధవారం లేఖ రాశారు. తన పాదయాత్రలో ఉన్న షర్మిల.. ఆ లేఖను ఖానాపూర్ లో మీడియాకు చూపారు. కాళేశ్వరం అవినీతిలో ఒక అద్భుతం అని ఆమె విమర్శించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు. ఈ ప్రాజెక్టు కుంభకోణం బయటకు రాకుండా మీడియా సంస్థలను సీఎం కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఒకటే కాళేశ్వరం స్కాం పై మాట్లాడుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు మేఘాకు జీతగాళ్లలా మారారన్నారు. ఆ రెండు పార్టీలకు కృష్ణారెడ్డి డబ్బులు పంపిస్తున్నారని, అందుకే ఎవరూ నోరు విప్పడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోడీ కూడా ఈ ప్రాజెక్టు అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

వైరం పెట్టుకుంటున్నట్లు నటిస్తున్నరు

బీజేపీ రోజ్ గార్​పై మంత్రి కేటీఆర్ మాట్లాడడం మంచిదే, కానీ ఇంతకాలం బీజేపీతో డ్యూయెట్లు పాడుకోవడంతోనే సరిపోయిందా అని షర్మిల ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే బీజేపీతో వైరం పెంచుకున్నట్లు నటిస్తున్నారని ఫైరయ్యారు. ‘‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేస్తే, మీరు (టీఆర్ఎస్) ఇంటికొక ఉద్యోగం ఇస్తామని మోసం చేయలేదా? ఇంకొకరిని విమర్శించే ముందు మీరు ఏం చేశారో చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్న మీరు (కేటీఆర్)..  మీరు కూడా అలాంటి శ్వేతపత్రమే విడుదల చేయాలి.