- హార్మూజ్ దిగ్బంధంతో తీవ్ర పరిణామాలు
- అమెరికా చర్యలకు తీవ్రంగా బదులిస్తం..
- ఆయిల్ బ్లాకేడ్ చేసినా తమకు 3 నెలల వరకూ ఢోకాలేదని వెల్లడి
- మరో 90 రోజులపాటు ఆయిల్ సరఫరా చేయగలమని ధీమా
టెహ్రాన్: ‘హార్మూజ్ జలసంధి’ ని అమెరికా దిగ్బంధించడంపై ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో భద్రత అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండకూడదని ఇరాన్ సైన్యం ప్రకటించింది. జలసంధి విషయంలో అమెరికా చేపట్టిన చర్యలకు తీవ్రంగా బదులిస్తామని, ఓడ రేవులపై తాము క్షిపణులతో ఎదురుదాడి చేస్తామని హెచ్చరించింది.
గల్ఫ్ దేశాల్లో ఏ ఓడరేవు కూడా సురక్షితంకాదని స్పష్టం చేసింది. ‘మీరు పోరాడితే, మేమూ పోరాడుతాం’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ ఘాలిబాఫ్ నేరుగా ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్‌లో జరిగిన చర్చలు విఫలం కావడమేనని తెలుస్తోంది.
గత శనివారం ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టింది. అయితే, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం కావాలని, అమెరికా ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన తమ నిధులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరుదేశాలు తమ 'రెడ్ లైన్స్' (పరిమితుల) విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో ఎటువంటి ఒప్పందం కుదరలేదు.
- భగ్గుమంటున్న చమురు ధరలు
అమెరికా దిగ్బంధన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అమెరికన్ క్రూడ్ ఆయిల్ 8 శాతం పెరిగి 104 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ 7% పెరిగి 102 డాలర్లకు చేరుకుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 70 డాలర్లుగా ఉన్న ధర, ఇప్పుడు 100 డాలర్ల మార్కును దాటడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారత్ వంటి ఇంధన దిగుమతి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం భిన్నంగా స్పందిస్తోంది. ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పూర్తిమద్దతు ప్రకటించగా, బ్రిటన్ మాత్రం తటస్థంగా ఉంది. తాము అమెరికా విధిస్తున్న ఈ దిగ్బంధనంలో భాగస్వాములం కాబోమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు.

