
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గొప్పతనం.. చరిత్ర అందరికీ తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని.. అలాగే భారత ప్రభుత్వం తరపున తపాళ బిళ్ల విడుదల చేయబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 101 జయంతి సంధర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ లో పలువురు నేతలు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా గర్వపడే వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. 101వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వ తరుపున, ప్రధాని నరేంద్ర మోడీ తరుపున ఘనంగా నివాళులర్పిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం చేశామని, పీఎం మ్యూజియంలో పివి గారి జ్ఞాపకాలను ఏర్పాటు చేశామన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా పివి నరసింహారావు గొప్పదనం.. ఆయన జీవిత చరిత్ర తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని.. అదేవిధముగా తపాలా బిళ్ల విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి వివరించారు.