రూ.5 వేల కోట్లు ఇస్తేనే బంద్ విరమిస్తం.. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల అల్టిమేటం

రూ.5 వేల కోట్లు ఇస్తేనే బంద్ విరమిస్తం.. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల అల్టిమేటం
  • 8న లక్ష మంది సిబ్బందితో  ఎల్బీ స్టేడియంలో సభ
  • ఇచ్చిన హామీ అమలు  చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదారేండ్లుగా పెండింగ్​లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో, కనీసం రూ.5వేల కోట్లు రిలీజ్ చేస్తేనే కాలేజీల బంద్ విరమిస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్ (ఫతీ) ప్రకటించింది. బకాయిల విడుదల కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు హామీలు ఇచ్చినా ఏ ఒక్కటీ నెరవేరలేదని వెల్లడించింది. 

హైదరాబాద్​లో ఫతీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సర్కారు నుంచి ప్రతిపాదనలు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల కోసం ప్రభుత్వం వేసిన కమిటీ, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఈ నెల 8న నిర్వహించే సభకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా ఫతీ చైర్మన్ రమేశ్ బాబు మాట్లాడారు. ‘‘సర్కారు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో గత్యంతరం లేక ఈ నెల 3 నుంచి అన్ని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు సమ్మెకు దిగినయ్. ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్​లో ఉంటున్నాయి. 

వారందరికీ క్షమాపణలు చెప్తూ, వారి మద్దతు కోసం ఈ నెల 8న ఎల్​బీ స్టేడియంలో లక్షమందితో అధ్యాపక సాంత్వన సభను ఏర్పాటు చేస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్  నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం వేసిన కమిటీని ఫతీ స్వాగతిస్తున్నది. కానీ, నివేదికను 3 నెలల్లో ఇవ్వాలని చెప్పడం కరెక్ట్ కాదు. దాన్ని నెలరోజుల్లో ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

ఫీజు బకాయిల కోసం ఈ నెల11న 10 లక్షల మందితో హైదరాబాద్​లో సభ పెట్టబోతున్నం’’అని ఆయన తెలిపారు. మేనేజ్​మెంట్లతో దురుసుగా, బెదిరింపులకు పాల్పడుతున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనను ఆ బాధ్యత నుంచి తప్పించాలని ఇప్పటికే సర్కారు పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు.  ఫీజుల నిధుల సేకరణ కమిటీలో అవగాహన లేని వ్యక్తులను తొలగించాలని డిమాండ్ చేశారు. 

మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి

సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్య చెప్పుకునేందుకు చాలాసార్లు ప్రయత్నం చేశామని, కానీ టైమ్ ఇవ్వలేదని ఫతీ వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

 సంక్షేమ పథకాలకు నిధులు ఆపలేమని చెప్తున్న ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా స్కీమే అనే విషయాన్ని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఫతీ జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్, ట్రెజరర్ కృష్ణారావు, ప్రతినిధులు రాందాసు, సునీత, రవికుమార్, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.