- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమిట్
- ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవంలో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా జపాన్.. కొరియా వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను, పర్యావరణ అనుకూల పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ఒక భారీ గ్లోబల్ సమిట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ గ్లోబల్ సమిట్ రాబోయే డిసెంబర్ 7, 8 మరియు 9 తేదీలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, సుస్థిర గ్రీన్ టెక్నాలజీలో, ప్రపంచలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చేపడుతున్న ఈ ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రజలందరూ భాగస్వాములై సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు, సుస్థిర నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
కేవలం సదస్సులో పాల్గొనడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక, గ్రీన్ విధానాలకు దిశానిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ‘సలహా మండలి’లో చేరి తమ విలువైన మార్గదర్శకత్వాన్ని అందించాలని డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పర్యావరణహిత నిర్మాణాలు కేవలం ఖరీదైన భవనాలు, విలాసవంతమైన అపార్ట్మెంట్లకే పరిమితం కాకుండా సామాన్యుల ఇండ్లు, ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు, గృహ నిర్మాణాల్లోనూ భాగం కావాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన్’ అంటే ఖరీదైనదనే అపోహ మారాలని, సుస్థిర నిర్మాణాలు సమాజంలోని అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
