పసుపు రైతులకు మద్దతుగా ఢిల్లీలో పోరాటం చేస్తాం

పసుపు రైతులకు మద్దతుగా ఢిల్లీలో పోరాటం చేస్తాం

పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. నూతన వ్యవసాయ చట్టలతో దేశంలోని 80 కోట్ల రైతాంగం అందోళనలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఒక రోజు రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అంటే రైతాంగ జిల్లా అని…రైతు ఉద్యమాలు అంటేనే ఆర్మూర్ ప్రాంతం గుర్తొస్తుందన్నారు. పసుపు రైతులు ఆందోళనలో ఉంటే బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు.

బీజేపీ అగ్రనేతలు ఎన్నికల సమయంలో ఇదే ఆర్మూర్ లో పసుపు రైతులకు అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయారని తెలిపారు రేవంత్ రెడ్డి. పసుపుకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు. అర్వింద్ గెలిస్తే పసుపు బోర్డు ఇస్తామని రాంమాదవ్ మాటిచ్చారని…ఎంపీ అర్వింద్ బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేసారని తెలిపారు. బోర్డు తెస్తావో లేదో తెలియదు.. కనీసం రైతుల కోసం ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు.

గతంలో ఇలాగే వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన కవితను రైతులు  ఓడించారని గుర్తు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. అర్వింద్ వన్ టైం వండర్ లాంటోడు.. ఒకేసారి ఆయనకు అవకాశం ఉందన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ పసుపు బోర్డు, మద్దతు ధర తేవడంపై ఆధారపడి ఉందన్నారు. అన్నింటి మీద మాట్లాడే బండి సంజయ్ కి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఎందుకు కనబడటంలేదన్నారు. 24 గంటల్లో బండి సంజయ్ ఆర్మూర్ కి వచ్చి రైతుల సమస్యల మీద ఏమి చెబుతారో నిర్ణయించుకోవాలన్నారు.

కేంద్రంతో యుద్ధమే చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎటు పోయాడో తెలియదన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ,టీఆర్ఎస్ కు అంతర్గత అవగాహన లేకపోతే రైతుల కోసం ఏం చేస్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మందులో సోడాలు కలిపే మంత్రి ప్రశాంత్ కూడా మాకు సలహాలు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపులో ఔషధ గుణాలు ఉన్నాయని..క్వింటాళ్లు పసుపు అమ్మితే… మాసం బంగారం రాని మన రాష్ట్రం బంగారు తెలంగాణ ఎలా అవుతుందన్నారు.

దేశంలో అత్యధిక ఆత్మహత్యలు రైతులవేనన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సాయం పొందాలంటే ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం పట్టిందన్నారు. సోయి లేని తాగుబోతు సీఎం కేసీఆర్ అన్నారు.ఆయన వాస్తు పిచ్చికి ప్రభుత్వ డబ్బులు వృధా అయ్యాయన్నారు. దేశంలో పంట పండించే రైతుకు ధర నిర్ణయించుకునే అధికారం లేని పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్…ప్రధాని మోడీకి లొంగిపోవటంతో రాష్ట్ర రైతులు నష్టపోతున్నారన్నారు. పసుపు మద్దతు ధర కోసం పార్లమెంటులో గళం విప్పుతామని స్పష్టం చేశారు. పసుపు రైతులంతా ఢిల్లీకి రండి, రాజధానిలో ఆందోళనలో చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఆకుపచ్చ కండువా సాక్షిగా మాటిస్తున్నా… పసుపు బోర్డు, పసుపుకి మద్దతుగా ఢిల్లీ లో పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు రేవంత్ రెడ్డి.