బషీర్‌బాగ్, వెలుగు: ఫీజు బకాయిల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దిగి వచ్చేంత వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి అధ్యక్షతన బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిర్వహించిన ఫీజు బకాయిలు తిరుగుబాటు ర్యాలీలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఖరితో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోందని విమర్శించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేసి, ఈ స్కీమ్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం నేతలు అనంతయ్య, మోదీ రాందేవ్, భీంరాజు, సతీశ్, రాజేందర్ పాల్గొన్నారు.
