
కామారెడ్డి: ఇటీవల కురిసిన వర్షం, వరదలతో కామారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంటలకు, ఆస్తులకు తీవ్ర నష్టం చేకూరిందన్నారు. గురువారం (సెప్టెంబర్ 4) సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడంతో పాటు వరద బాధితులను పరామర్శించారు సీఎం రేవంత్.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి.. పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్లో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించడం ద్వారా వరదల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం సహయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు.
సమస్య వచ్చినప్పుడు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరదలతో నష్టపోయిన అన్ని నియోజకవర్గాలకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వరద నష్టం వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, వైద్యం, ప్రాజెక్టులపై ప్రణాళిక ప్రకారం పని చేయాలని చెప్పారు. యూరియా సరఫరాలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.