బీఆర్ఎస్ అవినీతి పాలనపై ఉద్యమిస్తాం : ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్ అవినీతి పాలనపై ఉద్యమిస్తాం  : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : ‘‘రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ దిగి రావాలి.. లేదా దిగిపోవాలి”అనే నినాదంతో ఉద్యమం ప్రారంభిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రకటించారు. కేసీఆర్ మెడలు వంచేందుకు మూడు విడతల్లో ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై “కేసీఆర్ కో హఠావో.. తెలంగాణ కో బచావో, బీజేపీ కో జితావో’’ అనే నినాదంతో ఇప్పటికే పోరాటం చేస్తున్నమన్నారు. 

సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ అధ్యక్షతన ఉద్యమ కార్యాచరణపై ఇటీవలే నియమించిన కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలను ఎంపీ లక్ష్మణ్ మీడియాకు వివరించారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ దాకా మూడు విడతలుగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. మొదటి విడతలో 16న పల్లె బాట, బస్తీ బాట, ఈ నెల17న ప్రభుత్వ బాధితులతో, దరఖాస్తుదారులతో మండల, డివిజన్ ల వారీగా ముట్టడి, ఈ నెల18న అసెంబ్లీ నియోజకవర్గాలు కేంద్రంగా ప్రధాన రహదారులపై రాస్తారోకో, ధర్నా, ముట్టడి, దిగ్బంధం వంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. 

రెండో విడతలో భాగంగా.. ఈ నెల 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావ్, 24న రాష్ట్ర మంత్రుల ఘెరావ్, 27న జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలు చేపడుతామన్నారు. మూడో విడతలో భాగంగా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాన్ని  నిర్వహిస్తామని చెప్పారు.విద్య, వైద్యం ఖరీదైందని విమర్శించారు.