సింగరేణిపైకి  రాబందులను రానియ్యం..సంస్థ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే క్షమించం: భట్టి విక్రమార్క

సింగరేణిపైకి  రాబందులను రానియ్యం..సంస్థ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే క్షమించం: భట్టి విక్రమార్క
  • రాజకీయ స్వార్థం కోసం సింగరేణి ప్రతిష్టను దెబ్బతీస్తారా అంటూ ప్రశ్న
  • శ్రీరాంపూర్​ ఓపెన్​ కాస్ట్​ మైన్‌‌‌‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: సింగరేణిపైకి దోపిడీదారులను, రాబందులను రానీయ్యబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ లీడర్లు కార్మికుల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, రాజకీయ స్వార్థం కోసం సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఎస్​ఆర్పీ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని మంత్రి శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్‌‌‌‌తో కలిసి పరిశీలించారు. సింగరేణిపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేందుకు ఓపెన్ హౌస్ ఇన్‌‌‌‌స్పెక్షన్ నిర్వహించారు.

అనంతరం భట్టి మాట్లాడుతూ, సింగరేణిపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వివరించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్మికులు తమ శ్రమ, చెమటతో బొగ్గు ఉత్పత్తి చేసి దేశానికి వెలుగులు అందిస్తున్నారని, వారి ఆత్మగౌరవం కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సింగరేణి నిబద్ధతపై, సంస్థలోని పారదర్శక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, సంస్థలో ఏదో తప్పు జరిగిపోతుందంటూ కేంద్రానికి లేఖలు రాయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదని, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని అన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా ప్రక్రియలో పూర్తి పారదర్శకతతో తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. 

కార్మికులకు మెరుగైన వైద్య సేవలు..

సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, అత్యంత ఆధునికమైన క్యాథ్ ల్యాబ్ వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నామన్నారు. స్కూళ్లను అప్‌‌‌‌గ్రేడ్ చేసేందుకు ఇప్పటికే నిధులు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ విస్తరిస్తుందన్న నివేదికల నేపథ్యంలో ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్ బస్సులను మంజూరు చేస్తున్నామని తెలిపారు.

సింగరేణి కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్టు గుర్తుచేశారు. సివిల్స్‌‌‌‌కు ప్రిపేరయ్యే సింగరేణి కార్మికుల పిల్లలు ప్రిలిమ్స్, మెయిన్స్ రాయడానికి, ఇంటర్వ్యూలకు వెళ్లడానికి సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఓసీపీ మైన్‌‌‌‌లో భద్రత ప్రమాణాలు, బొగ్గు రవాణా వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. గని ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌‌‌‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతం పోట్రు, ఎన్.తిరుమల్ రావు, ఈడీ (కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, ఐఆర్టీఎస్, జీఎం (కో-ఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి. శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, 
బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ శ్రీ వీరభద్రం, జీఎం సేఫ్టీ రఘుకుమార్, కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.