మూసీ ప్రాజెక్టుపై  వెనకడుగు వేయం..హైదరాబాద్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం

మూసీ ప్రాజెక్టుపై  వెనకడుగు వేయం..హైదరాబాద్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం

 

  • గాంధీ విగ్రహానికి 5 వేల కోట్లు అనేది పచ్చి అబద్ధం.. దానికయ్యేది 70 కోట్లే: సీఎం రేవంత్‌‌
  •     నగర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం
  •     పేదల జీవితాలతో ఎవరూ రాజకీయం చేయొద్దు 
  •     ఉత్తరాదిలో రివర్ ఫ్రంట్‌‌లకు సపోర్ట్​ చేసి.. ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నరు?
  •     మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలను రాయాలి
  •     జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరుస్తం.. ‘ఫ్యూచర్ సిటీ’లో జర్నలిస్ట్ కాలనీ నిర్మిస్తం
  •     మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తం
  •     కాలేజీ విద్యార్థినులకు ఈవీ స్కూటీలు అందిస్తం
  •     అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రసంగం

హైదరాబాద్, వెలుగు:  నగర భవిష్యత్తును మార్చే మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. పేదల జీవితాలతో ఎవరూ రాజకీయం చేయొద్దని కోరారు.  నగర అభివృద్ధికి, పరిశుభ్రతకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించే ఏ శక్తినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. నాడు సామాన్యుడు పోలేని  ప్రగతి భవన్ గడీలను, నేడు అందరికీ అందుబాటులో ఉండే ప్రజా భవన్ వేదికలుగా 
మార్చేశామని చెప్పారు. గత పాలకుల్లా తాను ఉత్సవ విగ్రహంలా కాకుండా, ప్రతిరోజూ సామాన్య ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు.

ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా భవన్‌‌లో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ దేశంలోనైనా మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే ఆ దేశం ప్రపంచపటంలో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళా పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను, రాయితీలను తీసుకురాబోతుందని చెప్పారు.

 హైదరాబాద్‌‌లాంటి ప్రతిష్టాత్మక జిల్లాకు మహిళను కలెక్టర్‌‌గా నియమించామని, నక్సలైట్ల లొంగుబాటులోనూ మహిళా అధికారుల చొరవ అభినందనీయమన్నారు.  కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు అందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని, ఈ మేరకు కార్పొరేట్ ఆఫీసుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కఠిన నిబంధనలు తెస్తామన్నారు. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడంతో పాటు మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీలను నియమించే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నం..

తమ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలను కేవలం ఉచిత ప్రయాణికులుగా చూడకుండా, గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఏకంగా వెయ్యి బస్సులకు మహిళా సంఘాలను యజమానులను చేసి, రవాణా రంగంలో కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా వారికి అద్భుత అవకాశం కల్పించామన్నారు. అదానీ, అంబానీలాంటి దిగ్గజాలకు మాత్రమే పరిమితమైన సోలార్ విద్యుత్ రంగంలోనూ వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి మహిళా సంఘాలతో ఒప్పందాలు చేయించామని చెప్పారు.

రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడేల్లోని మహిళల చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా అమెజాన్‌లాంటి ఈ -కామర్స్ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. మల్టీ నేషనల్‌ కంపెనీల వస్తువులు మాత్రమే కనిపించే అమెజాన్‌లో.. మన మహిళల ఉత్పత్తులను ఉంచి వారి ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్నామని వివరించారు.

హైటెక్ సిటీ అనగానే కేవలం మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి ఐటీ కంపెనీలే కాదు.. ఇకపై మన మహిళా సంఘాల ఉత్పత్తులు కూడా అక్కడ సగర్వంగా కొలువుదీరుతాయన్నారు. హైటెక్ సిటీ పక్కనే మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి కోట్ల విలువైన స్థలంలో ‘ఇందిరా మహిళా శక్తి బజార్‌’ను ఏర్పాటు చేసి స్థానిక నైపుణ్యానికి పెద్దపీట వేశామన్నారు.

150కిపైగా స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ బజార్ ద్వారా మహిళల స్థానిక నైపుణ్యాన్ని గ్లోబల్ టాలెంట్‌గా మారుస్తున్నామని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.  

హైదరాబాద్ వ్యాపారాలకు అనుకూలం 

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం దేశ జీడీపీలో మన వాటా 5 శాతంగా ఉందని సీఎం రేవంత్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని ఈ దేశంలో ఉండే అన్ని మెట్రోపాలిటన్ నగరాల కంటే అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డిలకే దక్కుతుందని కొనియాడారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ అత్యంత కీలకమైన వెన్నెముకగా మారుతున్నదని, రాబోయే రోజుల్లో దీనిని ప్రపంచ నగరాలతో పోటీపడేలా చేస్తామని తెలిపారు.  అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్‌కు ఆకర్షించేందుకు ఇటీవల గ్లోబల్ సమిట్‌ నిర్వహించామని చెప్పారు. సర్వీస్ సెక్టార్‌ను మరింతగా విస్తరిస్తామని సీఎం పేర్కొన్నారు.

పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తం..

హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో, సింగపూర్ తరహాలో గ్లోబల్ సిటీగా మార్చడంతో పాటు పూర్తిస్థాయి ‘పొల్యూషన్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 1.34 కోట్ల జనాభాకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు.. రెడ్‌, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం వెలుపలకు (ఓఆర్ఆర్ బయటకు) పంపిస్తామని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్న 2,800 డీజిల్ ఆర్టీసీ బస్సులను దశలవారీగా 2026 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో జిల్లాలకు తరలిస్తామన్నారు. ‘‘నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులను తెస్తున్నాం, డిసెంబర్ 9 నాటికి ఒక్క డీజిల్ బస్సు కూడా నగరంలో ఉండదు” అని స్పష్టం చేశారు .  

నగరంలో కాలుష్యం వెదజల్లుతున్న రెండున్నర లక్షల ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా (రెట్రో ఫిటింగ్) మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఈవీ వెహికల్స్‌ కొనుగోలు చేసే పౌరులకు ప్రోత్సాహకంగా పూర్తిస్థాయిలో ‘జీరో ట్యాక్స్’ (రిజిస్ట్రేషన్ పన్ను రద్దు) విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.   

సామాన్యులకు అందుబాటులో ప్రజా భవన్‌..

బీఆర్‌‌ఎస్‌ పదేండ్ల పాలనలో  ప్రజా భవన్‌కు సామాన్యులు ఎప్పుడైనా వచ్చారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో గడియారం ముల్లులా పాలకుల చుట్టూ తిరిగిన కొద్దిమందికే ప్రవేశం ఉండేదని, 2023లో కాంగ్రెస్ రాగానే దానిని నిజమైన ప్రజావేదికగా మార్చేశామని పేర్కొన్నారు.

ప్రతిరోజూ ఉదయం ఎంతో మంది సామాన్యులు ప్రజా భవన్‌కు వచ్చి తమ సమస్యలను నేరుగా చెప్పుకునే స్వేచ్ఛను, హక్కును తాము కల్పించామని  చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నైనా, ప్రజలనైనా ప్రభుత్వాలు నిషేధిస్తే, చివరికి ఆ ప్రజలే పాలకులను శాశ్వతంగా నిషేధిస్తారన్నది చరిత్ర చెబుతున్న సత్యమని తెలిపారు.  

గాంధీ విగ్రహానికి 70 కోట్లే..

నగర ప్రతిష్టను ఇనుమడింపజేసే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ భవనానికి 200 కోట్లు ఖర్చు పెడితే ఎవరూ ప్రశ్నించలేదు. గాంధీ విగ్రహం కట్టడానికి రూ.5వేల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చవుతుంది” అని చెప్పారు.  

గాంధీ విగ్రహం వద్ద విజ్ఞాన మందిరానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ‘మూసీ అభివృద్ధిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?’  అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గుజరాత్‌లో సబర్మతి, ఢిల్లీలో యమునా,  యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ల అభివృద్ధిని స్వాగతించేవారు.. హైదరాబాద్‌లో మూసీని బాగుచేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని అడిగారు.

చట్ట ప్రకారం నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధన కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, ఎన్జీటీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అందులో కట్టిన నిర్మాణాలకు ‘జీరో వాల్యూ’ ఉంటుందని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా అంతే స్థలం ప్రభుత్వమే ఇచ్చి, నిర్మాణ వ్యయం ముందుగానే బ్యాంకు ఖాతాల్లో వేసి.. వారికి మేలు చేయాలని చూస్తున్నామని వివరించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరైనా నష్టపోతే.. ఆ నిర్వాసితులకు అండగా నిలబడి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంలో తమ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందుంటుందని చెప్పారు. అయినా సరే కొందరు నేతలు అక్కడికి వెళ్లి మొసలికన్నీరు కారుస్తున్నారని, వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చూపాలని సీఎం సవాల్ విసిరారు. రాజకీయాలు పక్కనపెట్టి నగర శ్రేయస్సు కోసం కేంద్ర మంత్రులుసహా అందరూ కలసి రావాలని, మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలను సమాజానికి తెలియజేయాలని సీఎం కోరారు. 

జర్నలిస్టుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెబుతామని, ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలోనే జర్నలిస్ట్ కాలనీకి అద్భుతమైన డిజైన్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాల హామీలు చట్టపరమైన చిక్కుల వల్ల సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆగిపోయాయని, తాము అలాంటి చారిత్రక తప్పులు చేయబోమని స్పష్టం చేశారు.

న్యాయపరమైన చిక్కులు రాకుండా, అత్యంత పారదర్శకంగా జర్నలిస్టులకు శాశ్వత ప్రాతిపదికన ఇండ్ల స్థలాలు, కాలనీలు కేటాయించేందుకు చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ‘‘ఈ ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటే జర్నలిస్టులకు ఒక ప్రత్యేక నైబర్‌హుడ్ డిజైన్ చేసి ఇస్తాం, దీనిపై త్వరలోనే తీపి కబురు వింటారు” అని పేర్కొన్నారు.  

ఇప్పటి వరకూ అపరిష్కృతంగా ఉన్న ఇండ్ల స్థలాల ఫైలుపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని, జర్నలిస్టుల కుటుంబాలకు నిజమైన పండుగ వాతావరణం తెస్తామన్నారు.  రాష్ట్ర పునర్నిర్మాణంలో జర్నలిస్టుల పాత్రను ఎవరూ మరువలేరని, వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. జర్నలిస్టుల ముసుగులో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలపై ఫిర్యాదు చేసేందుకు ఒక పటిష్ట వేదికను తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.  

నిజమైన జర్నలిస్టుల హక్కులను కాపాడటంతోపాటు నకిలీలను ఏరివేసేందుకు రాబోయే శాసనసభ సమావేశాల్లో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డెస్క్ మీద పనిచేస్తున్నప్పుడు చెడును ప్రసారం చేయకుండా ఆపిన ఎందరో జర్నలిస్టుల సహకారం తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిందని కృతజ్ఞతలు తెలిపారు.

డెస్క్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, ఫీల్డ్ రిపోర్టర్లతో సమానంగా వారికి సైతం అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మహిళా జర్నలిస్టులు ఎంతో సహకరించారని, తనపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని ఆపడంలో వారి పాత్ర మరువలేనిదని ప్రశంసించారు.  జర్నలిస్టు సంఘాలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి, అమలు చేసేందుకు మంత్రులకు కచ్చితమైన ఆదేశాలు ఇస్తామని సీఎం  స్పష్టం చేశారు.