
చేవెళ్ల, వెలుగు: ఎన్కేపల్లి గోశాల కోసం రైతుల భూములు తీసుకుంటున్న ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య సూచించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి గోశాల భూముల వద్ద రైతులు చేస్తున్న దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు.
సాగులో ఉన్న భూములను గోశాలకు కేటాయించడం సరికాదన్నారు. సరైన పరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములు గుంజుకుంటే సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడిగళ్ల భాస్కర్, జగదీశ్, కందుకూరి జగన్, అల్లి దేవేందర్, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.