మండలానికో ఇంటర్నేషనల్​ స్కూల్ .. ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు: భట్టి

మండలానికో ఇంటర్నేషనల్​ స్కూల్ ..  ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు: భట్టి
  • విద్యా శాఖకు బడ్జెట్​లో ప్రాధాన్యం 
  • ఖమ్మం, ఆదిలాబాద్​లో వర్సిటీలు ఏర్పాటు చేస్తం
  • విద్యా శాఖ ప్రతిపాదనల రివ్యూలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్,వెలుగు: అసెంబ్లీ ఎన్నిక‌ల సమయంలో ప్రజ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలో ఇంట‌ర్నేష‌న‌ల్  స్కూల్  ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ స్కూళ్ల ఏర్పాటు కోసం కావాల్సిన భూములను గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. బుధవారం డాక్టర్  బీఆర్  అంబేద్కర్  సచివాలయంలో 2024–25 వార్షిక బడ్జెట్​కు సంబంధించి విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి అధికారులతో భట్టి సమీక్షించారు. విద్యా శాఖలో అమలవుతున్న పథకాలు, విద్యా వ్యవస్థ నిర్వహణ గురించి అధికారులు పవర్ పాయింట్  ప్రజేంటేషన్  ఇచ్చారు. విద్యా బోధన, వసతుల కల్పనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను భట్టి ఆదేశించారు.

ప్రైవేటుకు దీటుగా సర్కారు యూనివర్సిటీల్లో కూడా ఉపాధి కోర్సులను తీసుకురావాలని ఆయన సూచించారు.  యూనివ‌ర్సిటీల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ఉద్యోగాలు పొందే విధంగా కోర్సులను రూపొందించాలన్నారు. ఖ‌మ్మం, ఆదిలాబాద్  జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనుమతులు లేకుండా  కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు అడ్మిషన్లు ఇచ్చి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని, అలాంటి వర్సిటీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను అడిగారు. ఇక ఇంటర్ లో నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంట‌ర్  కాలేజీలను త‌నిఖీ చేసి నివేదిక ఇవ్వాల‌ని, ఈ విష‌యంలో అధికారులు ఉదాసీనంగా వ్యవ‌హ‌రిస్తే ఉపేక్షించ‌బోమని హెచ్చరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడులకు విద్యుత్  సౌక‌ర్యం క‌ల్పించ‌డానికి, ఆ బడుల్లో సోలార్  విద్యుత్ ఉత్పత్తి చేయ‌డానికి ఆ భ‌వ‌నాల‌ను విద్యుత్తు శాఖ‌ ప్రిన్సిప‌ల్  సెక్రట‌రీకి అప్పగించాల‌ని కోరారు. 

బాసర ట్రిపుల్  ఐటీ నిర్వహణపై ఆరా

బాస‌ర ట్రిపుల్ ఐటీ నిర్వహ‌ణపై భట్టి ఆరా తీశారు. స్టూడెంట్లు, పేరెంట్స్ అసంతృప్తిగా ఉండటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.