తెలంగాణే  మా నెక్స్ట్ టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ

తెలంగాణే  మా నెక్స్ట్ టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
  • తెలంగాణే  మా నెక్స్ట్ టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
  • ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి కర్నాటక ఫలితాలే రిపీట్ అవుతాయి
  • న్యూయార్క్​లో ప్రసంగం

న్యూయార్క్: కర్నాటకలో మాదిరిగానే కాంగ్రెస్ విజయపరంపర దేశవ్యాప్తంగా కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘కర్నాటకలో బీజేపీని కేవలం ఓడించలేదు. మొత్తం పార్టీని తుడిచిపెట్టేశాం. మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ ఉండదు’’అని రాహుల్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ప్రోగ్రామ్స్ ముగించుకుని ఆదివారం న్యూయార్క్ చేరుకున్నారు. మాన్​హట్టన్​లోని జావిట్స్ సెంటర్‌‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత న్యూయార్క్‌‌లో ఇండియన్‌‌ ఓవర్సీస్‌‌ కాంగ్రెస్‌‌- – యూఎస్‌‌ఏ నిర్వహించిన ప్రోగ్రామ్​లో రాహుల్‌‌ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌‌ కేవలం పార్టీ కాదు. విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు పార్టీ సిద్ధమైంది. బీజేపీని తుడిచిపెట్టగలమని కర్నాటక ఎలక్షన్స్​తో నిరూపించాం. కర్నాటకలో బీజేపీకి గట్టిదెబ్బ కొట్టాం”అని రాహుల్ అన్నారు.

కర్నాటకలో బీజేపీని దీటుగా ఎదుర్కొన్నాం

కర్నాటకలో కాంగ్రెస్​ను ఓడించేందుకు బీజేపీ చాలా ప్రయత్నించిందని రాహుల్ అన్నారు. కానీ, పార్టీ లీడర్లు, కార్యకర్తలు బీజేపీని ఎంతో దీటుగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ‘‘ఎన్నికల టైంలో బీజేపీ అధికారంలో ఉంది. మీడియా మొత్తం వాళ్ల చేతుల్లోనే ఉంది. మా దగ్గర ఉన్నదానికంటే బీజేపీ వాళ్ల దగ్గర 10రెట్ల ఎక్కువ డబ్బు ఉంది. ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ప్రతీది వాళ్ల దగ్గరే ఉంది. అయినా మేమంతా కలిసి బీజేపీని తుడిచిపెట్టేశాం”అని రాహుల్ అన్నారు. నెక్ట్స్ తెలంగాణలోనూ బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత.. తెలంగాణలో బీజేపీ కనిపించడమే కష్టమవుతుందని అన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్,  చత్తీస్​గఢ్​లోనూ మాదే గెలుపు

తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని రాహుల్ అన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ కర్నాటక ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీని ఓడించేది కాంగ్రెస్ పార్టీ కాదు... దేశప్రజలే.. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సమాజంలో బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నది. విద్వేషపూరితమైన సమాజంతో దేశం అభివృద్ధి చెందదని ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలే బీజేపీని ఓడిస్తారు”అని రాహుల్ అన్నారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ఇదే రిపీట్ అవుతుందని తెలిపారు.

బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేస్తాం

ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయని రాహుల్ గాంధీ ప్రకటించారు. అందరూ కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘‘బీజేపీని ఓడించేందుకు కలిసి పని చేస్తున్నాం. ఇది సైద్ధాంతిక పోరాటం. బీజేపీది విభజించు పాలించు సిద్ధాంతం. మొత్తం ద్వేషంతో నిండిన పార్టీ అది. కాంగ్రెస్ మాత్రం ఆప్యాయత, ప్రేమాభిమానాలు కలిగిన పార్టీ. కర్నాటక ఎన్నికల టైంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. ప్రధానమంత్రి కూడా ట్రై చేశారు. కానీ ఇది పని చేసిందా? లేదు కదా..”అని రాహుల్ అన్నారు. కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, పాలన మొత్తం నిరుద్యోగంతో పాటు అవినీతితో నిండిపోయిందని విమర్శించారు. ‘‘ద్వేషం అనే మార్కెట్​లో ప్రేమ అనే షాపును తెరుస్తాం”అనే నినాదంతో భారత్ జోడో యాత్ర కొనసాగిందని గుర్తు చేశారు. ఈ ప్రోగ్రామ్​లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, అధికారులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

‘డిన్నర్ విత్ రాహుల్’ ఈవెంట్​లో రేవంత్

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీతో మీటింగ్​లో భాగంగా ఆదివారం న్యూయార్క్​లో ఏర్పాటు చేసిన డిన్నర్ ప్రోగ్రామ్​లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టెర్రేస్ ఆన్ ది పార్క్​లో నిర్వహించిన.. ‘మీట్ అండ్ గ్రీట్ డిన్నర్ విత్ రాహుల్ గాంధీ’ కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీతో కలిసి హాజరయ్యారు. పార్టీ సమష్టి కృషితో కర్నాటకలో విజయం సాధించామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ గెలిచి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. దీని కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలతో రాహుల్ చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, మదన్ మోహన్, కైలాశ్, కోట నీలిమ, అభిలాశ్, ఫహీంతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.