
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడోసారి తామే గెలిచి హ్యాట్రిక్ కొడతామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని మొరిగినా మళ్లీ గెలిచేది తామేనని.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 95 స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి కేసీఆర్‌ను దేశం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు ఎవరైనా వచ్చి డబ్బులిస్తే తీసుకొని బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని అన్నారు. ఓటుతోనే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ వెంట వెళ్లడమంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడం లాంటిదన్న విషయం వెంకట్రావుకు నెల రోజుల్లోనే అర్థమైందని, అందుకే ఆయన బీఆర్ఎస్‌లో తిరిగి చేరుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు చేరిన నాయకుల భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. కుమ్రంభీం కోరుకున్న ‘జల్.. జంగల్.. జమీన్’ నినాదం స్ఫూర్తితో తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ‘‘ఒక్క వానాకాలం సీజన్‌లోనే కోటి ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాం. తెలంగాణ మొత్తం భూమాత పచ్చచీర కట్టుకున్నదా అన్నట్టుగా పంటలు పండుతున్నాయి. కోటి రతనాల వీణ తెలంగాణ.. ఈ రోజు కోటి ఎకరాల మాగాణంగా మారింది. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైంది” అని అన్నారు.
జాతిని కేసీఆర్ మేల్కొల్పిండు
ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అనే వార్తలు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోనే ఇంటింటికీ సురక్షిత నీళ్లు ఇస్తున్నది మన ముఖ్యమంత్రి మాత్రమేనని చెప్పారు. జాతిని కేసీఆర్ మేల్కొపిన తర్వాతే.. కేంద్రం జల్ జీవన్ మిషన్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ‘‘భద్రాచలం అవతల కాంగ్రెస్ పాలనలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలు ఇచ్చిందా? అక్కడ రైతుబంధు ఇస్తున్నారా? 24 గంటల ఉచిత కరెంట్ఇస్తున్నారా? రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటున్నదా?’’ అని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ రైతులు తెలంగాణకు వచ్చి తమ పంటలు అమ్ముకొంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టిస్తోందని, దీంతో పట్టణాలు, పల్లెలకు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్‌తో పెద్దోళ్లయి ద్రోహం చేసిన్రు: పువ్వాడ
తన జీవితంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత తొమ్మిదేండ్లలో జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎవరికి టికెట్ఇచ్చినా సైనికుల్లా పని చేసి గెలిపించుకోవాలని అన్నారు. మూడు నెలలు ఇంటింటికీ వెళ్లి అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ద్వారా పెద్దోళ్లు అయి పార్టీకి ద్రోహం చేసిన కొందరు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్సోళ్లకు రైతుబంధు వస్తది
‘‘60 ఏండ్లు అధికారంలో ఉండి రూ.200 పింఛన్ ఇచ్చినోళ్లు.. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ఎట్ల నమ్మాలి? రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ఇస్తామంటే.. మూడు గంటల కంటే ఎక్కువ ఇవ్వొద్దని చెప్పే వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులకు రైతుబంధు వస్తున్నది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. వాళ్ల ఇంట్లోని పెద్దోళ్లకు ఆసరా పింఛన్, వారి బిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వస్తున్నాయి. అవన్నీ జేబులో పెట్టుకొని కేసీఆర్‌ను తిట్టడం అలవాటుగా మారింది’’ అని కేటీఆర్ మండిపడ్డారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చామని, 4.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని, ఇదంతా కేసీఆర్ ఘనతేనన్నారు. మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి స్థాయికి తగ్గకుండా భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కచ్చితంగా ఆ బాధ్యత తామే తీసుకుంటామన్నారు. గోదావరి వరదతో భద్రాచలం మునిగిపోకుండా కరకట్టలకు మరమ్మతులు చేస్తామన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడే ఏదో కొత్తగా వచ్చినట్టు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని, దీనిని ప్రజలు గుర్తించాలన్నారు.