అధికారంలోకి వస్తే అగ్రి బిల్లులను రద్దు చేస్తాం

అధికారంలోకి వస్తే అగ్రి బిల్లులను రద్దు చేస్తాం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హర్యానాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే కొత్త బిల్లులను రద్దు చేస్తామని పంజాబ్ రైతులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

దేశ ఎకానమీకి మూడు స్తంభాలైన కనీస మద్దతు ధర, ధాన్యం సేకరణ, హోల్‌‌సేల్ మార్కెట్లను ప్రధాని నరేంద్ర మోడీ నాశనం చేయాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ‘బీజేపీ ప్రధాన ధ్యేయం ఎంఎస్‌‌పీ, ధాన్యం సేకరణను నాశనం చేయడమే. ప్రభుత్వం వీటిని నాశనం చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోబోం. నేను మీకు హామీ ఇస్తున్నా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ నల్ల చట్టాలను తొలగిస్తాం. ఈ బిల్లులను రద్దు చేసే విషయంపై నరేంద్ర మోడీ సర్కార్‌తో పోరాటానికి సిద్ధం’ అని రాహుల్ పేర్కొన్నారు.