మనోళ్లు పేపర్ల మీదే ధనవంతులు.. నిజ జీవితంలో అన్నీ డబ్బు కష్టాలే.. నయా భారతంలో ఆర్థిక ఒత్తిడి

మనోళ్లు పేపర్ల మీదే ధనవంతులు.. నిజ జీవితంలో అన్నీ డబ్బు కష్టాలే.. నయా భారతంలో ఆర్థిక ఒత్తిడి

ఒకప్పుడు భారతీయులకు ఇన్వెస్ట్‌మెంట్ అంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్ లేదా ల్యాండ్ కొని పడేయడమే. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. చేతిలో స్మార్ట్‌ఫోన్, బ్యాంక్ అకౌంట్లో కాస్తో కూస్తో డబ్బు ఉంటే చాలు.. కుర్రకారు నేరుగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లోకి దూకేస్తున్నారు. ఆఫీస్ లంచ్ రూమ్స్ నుండి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల వరకు ఎక్కడ చూసినా SIPలు, మార్కెట్ కరెక్షన్ల ముచ్చట్లే. అయితే ఈ జోష్ కేవలం ఆర్థిక అవగాహనేనా? లేక అందరూ చేస్తున్నారు కదా అని మనం కూడా దూకాలా అనే ఒక రకమైన సామాజిక ఒత్తిడా? ఇండియాలో మారుతున్న ఈ క్రేజీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్‌పై ఓ లుక్కేద్దాం.

1. ఫైనాన్షియల్ టాస్క్.. 
గతంలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కేవలం పెద్దవాళ్లు లేదా బాగా డబ్బున్నవాళ్లకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు అది ఒక కల్చరల్ ఫినామినన్‌గా మారిపోయింది. 2015లో ఇండియన్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ ఆస్తులలో ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల వాటా 7% కంటే తక్కువ ఉంటే.. ఇప్పుడది ఏకంగా 14% కి చేరిందని ఆనంద్ రాఠీ వెల్త్ రిపోర్ట్ బయటపెట్టింది. టెక్నాలజీ పెరగడం, ఈజీ యాప్స్ అందుబాటులోకి రావడం, ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఉద్యోగాలు పెరగడంతో.. ఈ తరం యువత చాలా చిన్న వయసులోనే కెరీర్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా స్టార్ట్ చేసేస్తోందని రిపోర్ట్ పేర్కొంది.

2. సోషల్ మీడియా మాయాజాలం..
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు.. వీరంతా కలిసి ఇన్వెస్ట్‌మెంట్‌ను చాలా కూల్‌గా, ఈజీగా మార్చేశారు. ఇది మంచిదే అయినా.. దీని వెనుక ఒక పెద్ద రిస్క్ దాగుంది. ఎవరో పెట్టిన ప్రాఫిట్ స్క్రీన్‌షాట్ చూసో, వైరల్ అవుతున్న స్టాక్ టిప్స్ చూసో.. నేను ఎక్కడ వెనకబడిపోతానో అనే FOMOతో చాలామంది ఎలాంటి రీసెర్చ్ లేకుండా గుడ్డిగా డబ్బులు పెట్టేస్తున్నారు. లాంగ్ టర్మ్ గోల్స్ పక్కనపెట్టి, కేవలం ట్రెండ్స్ వెనుక పరిగెడుతూ మార్కెట్ బుల్ జోరులో ఉన్నప్పుడు కొని నష్టపోతున్నారు.

3. బేసిక్స్ మర్చిపోతే ఎట్లా బిగులూ?
చిన్న వయసులోనే సంపద సృష్టించాలనే తపన సూపర్. కానీ ఈ తొందరలో చాలామంది తమ ఆర్థిక పునాదిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మార్కెట్లో పెద్ద పెద్ద రిటర్న్స్ వెనుక పరుగెడుతూ.. బేసిక్ అవసరాలైన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ వంటి వాటిని లైట్ తీసుకుంటున్నారు. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని పక్కన పెట్టుకున్నాకే మార్కెట్లలోకి రావాలని నిపుణులు మొత్తుకుంటున్నా.. క్రేజ్‌లో పడి యువత వాటిని పట్టించుకోవడం లేదు.

4. స్క్రీన్ పైనే చూపు.. మైండ్‌లో టెన్షన్
డిజిటల్ యాప్స్ పుణ్యమా అని ఇప్పుడు పోర్ట్‌ఫోలియో వాల్యూ సెకన్ల వ్యవధిలో మారిపోతుంటుంది. దీంతో రోజుకు వంద సార్లు యాప్ ఓపెన్ చేసి చూడటం చాలామందికి ఒక వ్యసనంగా మారింది. మార్కెట్ కొద్దిగా పడిపోగానే విపరీతమైన యాంగ్జైటీ, స్ట్రెస్ పెరిగిపోతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు భవిష్యత్తులో మనశ్శాంతిని ఇవ్వాలి కానీ.. రోజువారీ జీవితంలో టెన్షన్ పెంచే కొత్త తలనొప్పి కాకూడదు.

ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ విప్లవం రావడం ఖచ్చితంగా మంచి విషయమే. దీంతో లక్షలాది మంది యువకులు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నారు. అయితే ఆర్థిక అవగాహనకు, వ్యసనానికి మధ్య ఉండే చిన్న గీత చాలా సన్నటిది. మార్కెట్ వెంట, రిటర్న్స్ వెంట బ్లైండ్‌గా పరుగెత్తడం కంటే.. క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ చాలా ముఖ్యం. సంపదను సృష్టించడం అనేది మన జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవడానికి అవకాశం అంతే కానీ అది ఇబ్బందులు కలిగించకూడదు. సో మెుత్తానికి మనం డబ్బును మేనేజ్ చేయాలే గానీ.. డబ్బు మనల్ని మేనేజ్ చేసే స్థాయికి ఒత్తిడిలో పడిపోకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి నయా భారతంలో కొనసాగుతున్న ఇన్వెస్ట్మెంట్ పరుగు ఆదాయం కంటే అలసటనే ఎక్కువగా ఇస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.