త్వరలో అల్పపీడనం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

త్వరలో అల్పపీడనం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ: నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిటీల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో సిటీ రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. మరో పక్క.. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నరాత్రి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. మూడు గంటల పాటు దంచికొట్టిన వానకు చాలా ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువుల్లా మారాయి. ఎప్పటిలాగే జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపించింది. మోకాళ్లలోతు నీటిలో టూవీలర్ పై వెళ్ళేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్ పల్లి, కృష్ణా నగర్ లో వాహనాలు కొట్టుకుపోయాయి. రెండుమూడు చోట్ల మనుషులు కూడా కొట్టుకుపోగా స్థానికులు కాపాడారు.

హైదరాబాద్ లో నిన్న రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 9.8 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డయింది. మలక్ పేట లో 9.6 సెంటిమీటర్లు, చందా నగర్ లో 8.8, సరూర్ నగర్ లో 8.5, మూసాపేట్ లో 8 సెంటిమీటర్లు, మాదాపూర్ లో 7.7, యూసుఫ్ గూడలో 7.6 సెంటిమీటర్ల వాన పడింది. కూకట్ పల్లిలో 7.1 సెంటిమీటర్లు, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్ కాలనీలో 6.8, ఫాతిమా నగర్ లో 6.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీనగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, మూసాపేట, మెహదీపట్నం, కార్వాన్, సంతోష్ నగర్, ఖైరతాబాద్, ఫలక్ నుమాలోని కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 6 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

అదేవిధంగా జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిద్దిపేటలోని గౌరారంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి లోని మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 10.5 సెంటిమీటర్లు, ఆలంపూర్ వివేకానంద నగర్ లో 9.8 సెంటిమీటర్ల వాన పడింది. నల్గొండలోని పుల్లెంలలో 10.2, చండూర్ లో 9.8, భద్రాద్రి కొత్తగూడెంలో 9.3 సెంటిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనాలను తెలంగాణ విద్యుత్ శాఖ అలర్ట్ చేసింది. విద్యుత్ వినియోగదారులు, ప్రజలు భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచించారు. వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలన్నారు. వర్షం కురిసేటప్పుడు విద్యుత్ లైన్లు ఉన్న చెట్ల కింద నిలబడటం, చెట్లు ఎక్కడం చేయొద్దన్నారు. వర్షం పడేటప్పుడు, తగ్గిన తరువాత పశువులను విద్యుత్ వైర్లకు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా తీసుకెళ్లాలన్నారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 లేదా 100 నంబర్ కు డయల్ చేయాలని అధికారులు సూచించారు.