
మరో మూడురోజుల దాక వానలు లేవంటున్న వాతావరణ శాఖ
ఇప్పటికే 50శాతం పత్తి సాగు చేన్లలో ఎక్కడికక్కడ వాడిపోతున్న మొలకలు
తొందరపడవద్దంటున్న వ్యవసాయాధికారులు
ఆదిలాబాద్ జిల్లా తంతోలికి చెందిన దేవన్న అనే రైతు నాలుగున్నర ఎకరాలు కౌలు తీసుకుని పత్తి సాగుచేస్తున్నాడు. మొదట్లో వర్షాలు బాగా పడడంతో విత్తనాలు వేయగా, మొలకెత్తాయి. కానీ నాలుగైదురోజులుగా వాన చినుకు లేకపోవడంతో నేలంతా నెర్రెలుబారుతున్నాయి. మొలకలు ఎండిపోతున్నాయని, మరో రెండు రోజులు వాన పడకుంటే చేసిన కష్టం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆదిలాబాద్, వెలుగు: మొదట్లో ఊరించిన వర్షాలు ఇప్పుడు వెనక్కి తగ్గినయ్. గడిచిన మూడు, నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాన జాడలేదు. దీనికి తోడు ఎండలు మండుతుండడంతో ఇప్పటికే వేసిన పత్తి మొలకలు చేలలోనే ఎండుముఖం పడుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల వరకు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
50 శాతానికి పైగా పత్తి సాగు..
ఈ ఏడాది స్టేట్‌వైడ్ 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ అధికారులు మొదట అంచనా వేశారు. కానీ కాటన్ సీడ్ అమ్మకాలు, ఇటీవలి వర్షాలకు సిద్ధం చేసిన దుక్కుల విస్తీర్ణాన్ని బట్టి మరో 10 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి సాగవుతుందని భావిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో 70శాతానికి పైగా పత్తిని రైతులు వర్షాధార పంటగానే పండిస్తారు. ఈ వానకాలం పత్తి తర్వాత కంది 20 లక్షల ఎకరాల్లో, సోయా 1.33 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలుగా సాగుచేస్తున్నారు. ఈసారి జూన్ మొదటివారంలోనే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అడపాదడపా వర్షాలు పడడంతో రైతులు ముందస్తుగానే సాగుకు ఉపక్రమించారు. పత్తి ఎక్కువగా సాగుచేసే ఉమ్మడి ఆదిలాబాద్‌లో 5.5 లక్షల ఎకరాలలో ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. తీరా గడిచిన నాలుగైదు రోజులుగా వర్షం పడకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయి.
మరో మూడు రోజుల పాటు ఇంతే..
రానున్న 72 గంటలవరకు తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచనలేదని తెలంగాణస్టేట్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వెదర్ రిపోర్ట్ ప్రకారం.. భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని కొన్ని ఏరియాల్లో మాత్రమే కొద్దిమేర వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి వర్షంపై ఆధారపడి సాగుచేసిన పంటలకు ఇబ్బంది తలెత్తే అవకాశముంది. ఇదే జరిగితే మొలకదశలో ఉన్న పత్తి, సోయాకు నష్టం వాటిల్లుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటున్నారు. రైతులు మొదటి దఫా వర్షాలకే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని, రెండో దఫా పుంజుకున్నాకే విత్తుకుంటే మంచిదని ఆఫీసర్లు చెబుతున్నారు.
తొందరపడి విత్తుకోవద్ధు
రానున్న మూడు రోజులపాటు వర్ష సూచన లేదు. ఎండలు తీవ్రమవడంతో ఇప్పటికే మొలకెత్తిన పత్తి చేన్లకు నీళ్లు ఇవ్వడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు వేసేవారు తొందరపడి ఇప్పుడే విత్తనాలు వేయద్ధు. ముఖ్యంగా పత్తి, తొగరి పంటలకు తొందరేమీ లేదు. కొద్దిరోజులు చూసి, వర్షాలు పుంజుకునే చాన్స్ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలి. - శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త , ఆదిలాబాద్