
- వైభవంగా తలంబ్రాలు కలిపే కార్యక్రమం
భద్రాచలం, వెలుగు: హోలీ సందర్భంగా తలంబ్రాలు కలిపే వేడుకతో శ్రీసీతారాముల పెండ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్10న శ్రీరామనవమి ఉన్నందున ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో శుక్రవారం తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మరోవైపు వసంతోత్సవం, ఇంకోవైపు ఊంజల్ ఉత్సవంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి(డోలా పౌర్ణమి) రోజున రామయ్యను పెండ్లి కుమారుడిని చేయడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామికి కొత్త బట్టలు పెట్టారు. ఊయలలో శ్రీసీతారామ లక్ష్మణ స్వామి వారిని కూర్చోబెట్టి పాటలు పాడుతూ మంగళహారతులు సమర్పించారు.
కోలాహలంగా వసంతోత్సవం
బేడా మండపంలో శ్రీసీతారామచంద్రస్వామికి వసంతోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామికి అభిషేకం చేసి 25 కలశాలతో విశేష స్నపన తిరుమంజనం జరిగింది. స్వామివారిపై అత్తరు, పన్నీరు, బుక్కా, గులాల్, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, వివిధ రంగులలతో తయారు చేసిన మిశ్రమాన్ని చల్లారు. ఆ తర్వాత అదే మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని ఆలయ సిబ్బంది,అధికారులు, భక్తులు వసంతమాడారు. తర్వాత డోలోత్సవం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి సేవ జరిగింది. పవళింపు సేవ,సంధ్యాహారతి, మూలవరుల స్వర్ణ కవచధారణ రద్దు చేశారు.