తెలంగాణ రైజింగ్కు డబ్ల్యూఈఎఫ్ దన్ను

తెలంగాణ రైజింగ్కు డబ్ల్యూఈఎఫ్ దన్ను
  • 2047 విజన్‌‌‌‌‌‌‌‌లో భాగస్వామ్యం అవుతామని వెల్లడి
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ‘ఫాలో అప్’ సదస్సు ప్రతిపాదనపై పాజిటివ్
  • తెలంగాణ ఆర్థిక వృద్ధికి పాటుపడ్తామని భరోసా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌‌‌‌‌‌‌‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ మద్దతు లభించింది. దావోస్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ విజన్‌‌‌‌‌‌‌‌కు తాము పూర్తి అండగా ఉంటామని, ఇందులో భాగస్వామ్యం అవుతామని డబ్ల్యూఈఎఫ్ స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో తాము కూడా కలిసి వస్తామంటూ సానుకూల సంకేతాలు ఇచ్చింది. దావోస్ వేదికగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4 ఐఆర్​ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ విజన్‌‌‌‌‌‌‌‌లోని విభిన్న కోణాలు పరస్పర సహకారానికి గొప్ప అవకా శం కల్పిస్తున్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ ర్సిటీ వంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం ఈ సందర్భంగా వివరించారు. స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.

ఆదర్శంగా సీ4 ఐఆర్

గతంలో హైదరాబాద్ వేదికగా జరిగిన బయో ఏషి యా–2024లో ప్రారంభించిన ‘సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్’ పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. ఇండియాలో ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రం గాలకు సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ ఇదేనని గుర్తుచేశారు. ఇది ఆదర్శవంతమైన మోడల్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందిందని, పరిశ్రమల అభివృద్ధిలో ఉత్తమ పద్ధతులపై సీ4ఐఆర్ చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని జెరెమీ హామీ ఇచ్చారు. దావోస్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, చర్చల పురో గతిని సమీక్షించుకునేందుకు ఏటా జులైలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో-అప్’ సదస్సును నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.

రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అనుకూలతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని సీఎం వివరించారు. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ బృందం సానుకూలంగా స్పందించింది. అయితే, ఇప్పటికే చైనాలో ప్రతి ఏటా ‘సమ్మర్ దావోస్’ జరుగుతున్నదని, సౌదీ అరేబియా కూడా ఇలాంటి ఆసక్తిని కనబరుస్తున్నదని జెరెమీ జర్గెన్స్ పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా..

ఈ సమావేశంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే రోడ్‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌ను సీఎం వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3 జోన్ల నమూనాను విశ్లేషించారు. ‘క్యూర్, ప్యూర్, రేర్’ ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు.. నెట్-జీరో గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ గురించి వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ఉన్న అనుకూలతలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.