- బడ్జెట్ ఎంతైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ గురుకుల హాస్టల్స్ లో విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో రాజీ పడమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ కు రిపేర్లు, వసతులు, రవాణా సౌకర్యం లేని చోట్ల ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిధుల కొరత లేదని, వసతుల కోసం ఎంత బడ్జెట్ నైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
గురువారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ముందస్తు బడ్జెట్ కేటాయింపులపై సెక్రటేరియెట్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను అత్యున్నత స్థాయికి తీసుకురావాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి అన్నారు.
ఆయన ఆశయాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని సూచించారు. విద్యార్థుల విద్యా బోధన, ఉత్తమ ఫలితాలు, ఉన్నత శిఖరాలకు చేర్చే గురుతరమైన బాధ్యత ఉన్నతాధికారులదేనని, అందుకు అవసరమైన సదుపాయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను పెంచామని, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నిర్మిస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాలను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలను అధికారులు ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అంబేద్కర్ ఓవర్ సిస్ లో ఎస్సీ విద్యార్థులకు మేలు జరగాలని లబ్ధిదారుల సంఖ్యను గతంలో ఉన్న 200 సీట్లను 500కు పెంచామని మంత్రి గుర్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సివిల్స్, గ్రూప్ 1 ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడలో కొత్తగా రెండు స్టడీ సర్కిళ్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. వీటిలో ఢిల్లీ, చెన్నై తరహాలో కోచింగ్ ఉండేలా వసతులు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ రివ్యూలో ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్, మహిళ స్ర్తీ సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్, గురుకులాల సెక్రటరీలు పాల్గొన్నారు.
