- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మత్తు పదార్థాలతో పాటు ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యసనాల బాట పట్టకుండా మైదానాల బాట పట్టాలని మంత్రి సూచించారు. శనివారం ఎల్ బీ స్టేడియంలో 19వ రాజీవ్ గాంధీ అండర్–19 టీ–20 క్రికెట్ చాంపియన్‌షిప్–2026 ముగింపు కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. యూత్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నారని మంత్రి అడ్లూరి వివరించారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, హర్కర వేణుగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు సాయికుమార్, శివసేన రెడ్డి పాల్గొన్నారు.
