- అదనంగా వేలాది రూపాయలు వసూలు
- ఇండిగోలో రూ.2,300 వరకు విధింపు
- ఎయిర్ ఇండియాలో రూ.18 వేల వరకు వడ్డింపు
- ఇతర కంపెనీలదీ ఇదే బాట
న్యూఢిల్లీ:పశ్చిమాసియాలో యుద్ధం విమాన ప్రయాణికుల జేబును ఖాళీ చేస్తోంది.వీటిలో ఇంధనంగా వాడే ఏటీఎఫ్ ధరలు ఈ నెల నుంచి భారీగా పెరగడంతో ఎయిర్‌లైన్ కంపెనీలు ప్రయాణికుల నుంచి సర్‌చార్జీల రూపంలో అదనంగా పెద్ద మొత్తాలు వసూలు చేస్తున్నాయి. విమానాల నిర్వహణ ఖర్చుల్లో ఏటీఎఫ్ వాటా దాదాపు 40 శాతం ఉంటుంది.
యుద్ధం మొదలైన తర్వాత అంటే ఫిబ్రవరి 28 నుంచి అంతర్జాతీయంగా జెట్ ఇంధనం ధరలు రెట్టింపు అయ్యాయి. దీనివల్ల విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భద్రతా కారణాల వల్ల అనేక సంస్థలు పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించడం లేదు. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతున్నాయి.
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో శనివారం నుంచి దేశీయ, అంతర్జాతీయ టికెట్లపై ఇంధన చార్జీలు వసూలు చేయనుంది. ప్రాంతాన్ని బట్టి ఇవి రూ.425 నుంచి రూ. రూ.1,800 వరకు ఉంటాయి. యూరప్ ప్రయాణాలకు అదనంగా రూ.2,300 చెల్లించాల్సి ఉంటుంది. ఆకాశ ఎయిర్ రూ.200 నుంచి రూ.1,300 వరకు సర్చార్జ్ వేస్తున్నట్టు ప్రకటించింది.
ఎయిర్ ఇండియాలోనూ భారీగా పెంపు
ఎయిర్ ఇండియా, ఏఐ ఎక్స్‌ప్రెస్ కూడా విడతల వారీగా సర్‌చార్జీలను విధిస్తున్నాయి. ఈనెల 12 నుంచి దేశీయ సార్క్ దేశాల రూట్లకు రూ.399 వసూలు చేస్తున్నారు. పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లేవాళ్లు 10 డాలర్ల చొప్పున, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లేవారు 60 డాలర్ల చొప్పున అదనంగా చెల్లించాలి. ఈనెల 18 నుంచి యూరప్ ప్రయాణాలకు 125 డాలర్లు (రూ.11,568), ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాకు 200 డాలర్లు (రూ.18,508) అదనంగా భారం పడనుంది. స్పైస్ జెట్ సంస్థ కూడా ఈ పెంపును తప్పనిసరి అని పేర్కొంది. ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించాలని ఈసంస్థ కోరింది.
వేలాది విమానాలు రద్దు
గ్లోబల్‌గా ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 10 మధ్య మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లాల్సిన 43 వేల విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి. క్యాథే పసిఫిక్, ఫిన్ ఎయిర్, ఎయిర్ న్యూజిలాండ్, క్వాంటాస్, థాయ్ ఎయిర్వేస్ వంటి అంతర్జాతీయ సంస్థలు టికెట్ ధరలను పెంచాయి. కొన్ని సంస్థలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. హాంకాంగ్ ఎయిర్ లైన్స్ తన సర్‌చార్జీలను 35.2 శాతం పెంచింది. మరికొన్ని సంస్థలు ఇంధన ఖర్చులను నేరుగా టికెట్ ధరల్లోనే కలిపి వేస్తున్నాయి. చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లు దాటడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత భారం కానుంది. ఏఐ ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా వంటి బడ్జెట్ ధరల విమాన సంస్థలు కూడా తమ చార్జీలను పెంచాయి.
ఇండిగోలో చార్జీలు ఇలా..
- డొమెస్టిక్, పొరుగు దేశాలు: రూ.425
- మిడిల్ ఈస్ట్: రూ.900
- ఆగ్నేయాసియా, చైనా: రూ.1,800
- ఆఫ్రికా, పశ్చిమాసియా: రూ.1,800
- యూరప్ దేశాలు: రూ.2,300
