V6 News

బెంగాల్‌‌‌‌‌‌‌‌లో మొదలైన తుది దశ పోలింగ్‌‌‌‌‌‌‌‌.. మొత్తం 142 స్థానాల్లో ఎన్నికలు

బెంగాల్‌‌‌‌‌‌‌‌లో మొదలైన తుది దశ పోలింగ్‌‌‌‌‌‌‌‌.. మొత్తం 142 స్థానాల్లో ఎన్నికలు

కోల్‌‌కతా: బెంగాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌‌ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ దశలోనే సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న హై-ప్రొఫైల్ నియోజకవర్గం ‘భవానీపూర్’, బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్లలో పోలింగ్ జరగనుంది.

మొత్తం 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. దాదాపు 3.21 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా పాస్‌‌పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఎన్నికల సంఘం సూచించింది.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొబైల్ ఫోన్లను లోపలికి అనుమతించబోమని, అలాగే పార్టీ గుర్తులు ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈసారి పోలింగ్ కు ఎన్నికల సంఘం మునుపెన్నడూ లేనివిధంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 2,32,100 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది.

ఒక్క కోల్‌‌కతా పరిధిలోనే 27,300 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత హుగ్లీ, ఈస్ట్ బర్ధమాన్ జిల్లాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా పోలింగ్ పర్యవేక్షణకు డ్రోన్​ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

ప్రజాస్వామ్య పండుగలో భాగమవ్వండి
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు, తొలిసారి ఓటు వేసే వారు ప్రజాస్వామ్య పండుగలో భాగమవ్వాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బెంగాల్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ప్రతి ఓటు ఎంతో విలువైందన్నారు. మొదటి దశలో రాష్ట్రం రికార్డు స్థాయిలో 93.19% పోలింగ్‌‌ను నమోదు చేసి బెంగాల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అదే స్ఫూర్తితో రెండో దశలో కూడా భారీగా ఓటర్లు తరలిరావాలని అధికారులు కోరారు. ఓటర్లు ఉదయాన్నే పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవాలని, తద్వారా క్యూ లైన్ల ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓటు వేయవచ్చని అధికారులు సూచించారు. కాగా, బెంగాల్‌‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నీ కలిపి మే 4న విడుదలవుతాయి.