SA20 2024: వెస్టిండీస్ క్రికెటర్‌పై తుపాకీ గురి పెట్టిన దుండగులు

SA20 2024: వెస్టిండీస్ క్రికెటర్‌పై తుపాకీ గురి పెట్టిన దుండగులు

వెస్టిండీస్ టీ20 స్పెషలిస్ట్ ఫాబియన్ అలెన్ కు చేదు అనుభవం ఎదురైంది. జోహన్నెస్‌బర్గ్‌లో ఒక హోటల్ కు వెళ్తున్న అలెన్ పై దుండగులు చుట్టుముట్టారు. సన్ హోటల్ సమీపంలో తుపాకీ చూపిస్తూ అతన్ని బెదిరించి అతని ఫోన్ తో పాటు అతని వ్యక్తిగత వస్తువులను దొంగిలించారు. అందులో ఒక బ్యాగ్ కూడా ఉంది. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్ లో పాల్గొనే ఆటగాళ్ల విషయంలో భద్రత గురించి ఆందోళన ఏర్పడింది.  

SA20 లీగ్ ప్రతినిధి విచారణలను పోలీసు అధికారికి తెలియజేసారు. ప్రస్తుతం అలెన్ దక్షిణాఫ్రికా టీ20 లెగ్ లో పార్ల రాయల్స్ తరపున ఆడుతున్నాడు. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం పార్ల రాయల్స్ ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ అలెన్ ను చేరుకున్నాడని.. ఓబెడ్ మెక్‌కాయ్ (మరొక వెస్టిండీస్ ఇంటర్నేషనల్) ద్వారా సంప్రదింపులు జరిగాయని తెలియజేసింది. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని..మరిన్ని వివారాలు తెలియాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో అలెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్ల రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 మ్యాచ్ లాడిన ఈ విండీస్ ఆల్ రౌండర్ బ్యాటింగ్ లో 38 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వెస్టిండీస్ తరపున 20 వన్డేల్లో 200 పరుగులు చేసి 7 వికెట్లు తీసుకున్నాడు. 34 టీ20ల్లో 267 పరుగులతో పాటు 24 వికెట్లు పడగొట్టాడు.