ఎంపీకే భద్రత ఇవ్వలేదు.. సామాన్యుల పరిస్థితేంటి?.. రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు సీఎల్పీ నేత భట్టి ప్రశ్న

ఎంపీకే భద్రత ఇవ్వలేదు.. సామాన్యుల పరిస్థితేంటి?.. రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు సీఎల్పీ నేత భట్టి ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో ఓ ఎంపీకే రక్షణ లేకుంటే, సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం.. విచారించి నిజాలను ప్రజలకు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు.

దర్యాప్తు సంస్థలు, పోలీసులను వాళ్ల దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్‌‌‌‌కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని చెప్పారు. బంద్ దేని కోసం చేశారని, వారి పాలనపై వారే బంద్ ప్రకటన ఇచ్చుకున్నారా అని నిలదీశారు. అహింసను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులను ప్రోత్సహించదని, ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు.