వెలుగు ఓపెన్ పేజీ: విశ్వగురు మౌనం దేనికి సంకేతం.?

వెలుగు ఓపెన్ పేజీ:  విశ్వగురు మౌనం దేనికి సంకేతం.?

భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాలలో చురుకైన పాత్రను నిర్వహించలేకపోతుందా?  అంతర్జాతీయ రాజకీయాలలో  తన గత  ఉనికిని,  వారసత్వాన్ని నిలుపుకోలేకపోతుందా?  గత  కొంతకాలంగా పొరుగు దేశాలు,  ప్రపంచ దేశాలతో  భారతదేశ సంబంధాలు రోజురోజుకూ  బలహీనపడుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే చెప్పాలి. అందుకు  ప్రధానకారణం  జరుగుతున్న  పరిణామాలపై  ప్రధాని  నరేంద్ర మోదీ  పెదవి విప్పక పోవడమే. సంవత్సరం క్రితం వరకు మోదీని  గ్లోబల్ లీడర్​గా  జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది.  ట్రంప్ అమెరికా  అధ్యక్షుడిగా  గెలిచిన తర్వాత  జరుగుతున్న ప్రపంచ  రాజకీయ  పరిణామాలపై  మోదీ మౌనం  వహిస్తున్నారు.  గత  12 ఏళ్లుగా  నిరంతరం విదేశీ  పర్యటనలు చేస్తూ,  భారత్  ప్రపంచ రాజకీయాలలో  విశ్వగురు పాత్ర  పోషిస్తుందని  ప్రకటించారు. అలాంటి మోదీ  నేడు మౌన మునిలాగ మారడం దేనికి సంకేతం?

ఈ  పరిస్థితులన్నింటికీ కారణం అమెరికా అధ్యక్షుడు  ట్రంప్  చేస్తున్న ఒత్తిడికి  ప్రధాని  మోదీ తలొగ్గుతున్నారనే  అనుమానాలు పెరుగుతున్నాయి.   ట్రంప్  గెలుపు కోసం  అమెరికాలో  పర్యటిస్తూ ‘నమస్తే ట్రంప్,  అబ్కీ  బార్  ట్రంప్ కీ సర్కార్’ అంటూ  మోదీ  విస్తృతంగా  ప్రచారం చేశారు.  కానీ,  ట్రంప్   మోదీకి  షాక్  ఇచ్చారు.  అమెరికాలో  వీసా  గడువు ముగిసిన  భార తీయుల కాళ్లకు,  చేతులకు  సంకెళ్లు వేసి  విమానంలో  మన దేశానికి పంపించారు.  ఈ  సంఘటన  నుంచి  అనేక  సందర్భాలలో  ట్రంప్  మన  దేశానికి  వ్యతిరేకంగా  ప్రకటనలు చేశారు.   కొలంబియా  దేశస్తులను కూడా  ట్రంప్  సంకెళ్లు వేసి పంపించారు.  దీనిని  కొలంబియా దేశం తీవ్రంగా వ్యతిరేకించింది.  కానీ,  మన  ప్రధాని మోదీ  కనీసం  ఖండించలేదు.

ట్రంప్​ టారీఫ్​ల షాక్​

భారతదేశ  వస్తువులపై 50%  టారిఫ్​లు  విధిస్తూ  ట్రంప్  మరో  షాకిచ్చారు.  దీనిపై  కూడా  మోదీ  మౌనం దాల్చారు.  ఈ  టారీఫ్​లతో  గత ఆరు  నెలల నుంచి  భారత  కంపెనీలు దివాలా తీస్తున్నాయి. అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి  మనం  దేశానికి  చమురు  దిగుమతులను తగ్గించారు.  భారత్,  ఇరాన్  దేశాల మధ్య ఒప్పందంతో  ఏర్పడిన  ‘ఛాబహర్ ఓడరేవు ప్రాజెక్టు’ చాలా  కీలకమైంది. ఇరాన్​లోని  అరేబియా  సముద్రంపై  నిర్మించిన  ఈ  ఓడరేవు  ప్రాజెక్టు వల్ల  భారత  వాణిజ్యం  మధ్య  ఆసియా,  యూరప్  దేశాలలో  విస్తరించడానికి  అవకాశం  లభిస్తుంది.  భారత్ ఈ  ప్రాజెక్టు నుంచి  తప్పుకోవాలని  28  అక్టోబర్  2025న  అమెరికా  ప్రభుత్వం  మన  ప్రభుత్వానికి లేఖ రాసింది.  ఈ  లేఖలో ఆరు నెలలు గడువు విధిస్తూ  26 ఏప్రిల్  2026  వరకు  సమయం ఇచ్చింది.  ఈ ప్రాజెక్టు  నుంచి  తప్పుకోకపోతే  మరో 25 శాతం టారిఫ్​ లు  అధికంగా  విధిస్తామని  హెచ్చరించింది. ఛాబహర్  ప్రాజెక్టు  భారతదేశానికి  అత్యంత  కీలకమైందని,  ఇది భారత‌ వాణిజ్య విస్తరణకు  కీలకమని, ఇది చైనా  ఆధిపత్యాన్ని  నియంత్రిస్తుందని గతంలో  మోదీ  గొప్పగా ప్రకటించారు. దీనికోసం  ఇప్పటికే  భారత  ప్రభుత్వం  వేల కోట్లు ఖర్చు పెట్టింది.

 మోదీపై  ట్రంప్​ ఒత్తిడి 

నేడు  ట్రంప్ ఒత్తిడితో  మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారోనని  దేశ ప్రజలు  వేచి చూస్తున్నారు.  గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఇరాన్​తో  భారత్​కు మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి.  కానీ,  ట్రంప్  ఒత్తిడితో  నేడు ఈ సంబంధాలు ప్రశ్నార్థకంగా  మారాయి.  ఈ  సంవత్సరంలో  బ్రిక్స్ దేశాల  సదస్సును  భారత  ప్రభుత్వం  మనదేశంలో  నిర్వహించబోతోంది.  ఇదే నెలలో  దక్షిణాఫ్రికాలోని   కేప్ టౌన్​లో  బ్రిక్స్ దేశాల  సైనిక  విభాగాలు  ప్రపంచ శాంతికోసం చేసిన  ప్రదర్శనలో  భారతదేశం  పాల్గొనలేదు.   బ్రిక్స్​లోని  10  సభ్య దేశాలలో  9 దేశాలు పాల్గొన్నాయి.  ఒక్క మనదేశం మాత్రం పాల్గొనలేదు.  దీనికి  కూడా  అమెరికా  ఒత్తిడే  కారణమని  రాజకీయ వర్గాలు  అంచనా  వేస్తున్నాయి.  త్వరలో  బ్రిక్స్  దేశాల  సదస్సుకు నాయకత్వం  వహించే  దేశమే ఈ ప్రదర్శనలో పాల్గొనకపోవడం ఎలాంటి సంకేతం 
ఇస్తుంది?    ట్రంప్ తన ఆధిపత్యాన్ని  ప్రపంచ దేశాలపై  ప్రదర్శిస్తున్నాడు.  వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ ను  కాదని  తనకు  ఇష్టం వచ్చినట్లు టారిఫ్​లు  విధిస్తున్నాడు.  దీనిని  భారత ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతోంది.  

ట్రంప్​ గ్రీన్​ల్యాండ్​ వ్యాఖ్యలపై స్పందించాలి

 డెన్మార్క్ లోని  గ్రీన్ ల్యాండ్ ను  స్వాధీనం  చేసుకుంటామని   ట్రంప్  బహిరంగంగా  ప్రకటిస్తున్నారు.  డెన్మార్క్ తోపాటు  ఫ్రాన్స్,  జర్మనీ,  బ్రిటన్  దేశాలు  ట్రంప్  ఆధిపత్యాన్ని  ప్రశ్నిస్తున్నాయి.  అంతెందుకు,  అమెరికాలో  కూడా  ట్రంప్​కు  వ్యతిరేకంగా  అక్కడి  ప్రజలు  నిరసనలు  చేస్తున్నారు.   భారతదేశం  కంటే  చిన్న  దేశాలైన  ఫిన్లాండ్,  నార్వే,  స్వీడన్,  నెదర్లాండ్,  దక్షిణాఫ్రికా  దేశాలు  ట్రంప్  దూకుడును  నిరసిస్తున్నాయి.‌  కానీ,  ప్రపంచంలో  అతిపెద్ద ప్రజాస్వామ్య  దేశానికి  ప్రధాని అయిన  మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నారు.

 ‘బోర్డు ఆఫ్ పీస్’  కమిటీని వ్యతిరేకించాలి

 మన చిరకాల శత్రువు అయిన పాకిస్తాన్​తో  ట్రంప్  స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నారు.  పాకిస్తాన్  ప్రతినిధులను  వైట్​హౌస్​కి పిలిచి లంచ్  సమావేశాలు నిర్వహించారు.  ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది కూడా  తనేనని  ట్రంప్​  ప్రకటించుకున్నారు.  దీనిని కూడా మోదీ బహిరంగంగా ఖండించలేకపోవడం బాధాకరం.  ట్రంప్ తనకు అనుకూలంగా ఉన్న దేశాలతో కలిపి  గాజాపై  ఒక  ‘బోర్డు ఆఫ్ పీస్’  కమిటీ  ఏర్పాటు  ప్రతిపాదన చేశారు.  ఇందులో  భారతదేశాన్ని  కూడా  ఆహ్వానించారు.  ఈ  కమిటీలో  పాకిస్తాన్​కు కూడా ఆహ్వానం  పంపారు.  శత్రుదేశం  పాకిస్తాన్ ఉన్న  ఈ కమిటీలో  భారతదేశం  ఉండడం  సమంజసమేనా? ఈ  కమిటీ  ఏర్పడితే  ఐక్యరాజ్య సమితి  నిర్వీర్యం అవుతుంది.  అమెరికా  వీటో  పవర్  చెలాయిస్తుంది. మోదీ  ప్రభుత్వం ఈ ఆహ్వానాన్ని  వ్యతిరేకించాలి. లేకపోతే  అమెరికా ఆధిపత్యానికి తలోగ్గినట్లు అవుతుంది.

 ఇకనైనా ప్రధాని మోదీ మౌనం వీడాలి

ప్రధాని మోదీ  బహిరంగ సభలలో  మాత్రం  భారత్  సూపర్  పవర్ అని,  విశ్వ గురువు అని,  అమెరికాతో  పోటీ పడుతుందని  ఉపన్యాసాలు  ఇస్తారు.  కానీ,  ట్రంప్​కు  వ్యతిరేకంగా  ఒక్కమాటనైనా  అనలేకపోతున్నారు. అంతర్జాతీయ  రాజకీయాలలో  భారతదేశ  ప్రాధాన్యత  రోజురోజుకూ  తగ్గుతున్నా  ఇవేవీ  మోదీ  పట్టించుకోవడం లేదు.  త్వరలో  అస్సాంలో,   పశ్చిమ బెంగాల్లో  జరిగే  ఎన్నికలలో  ఎలా  గెలవాలని వ్యూహాలు  రచిస్తున్నారు. ఇక్కడ  బంగ్లాదేశ్  చొరబాటుదారుల  అంశాన్ని  ప్రస్తావిస్తూ  ఎన్నికల్లో  లాభం పొందాలని  చూస్తున్నారు.  భారత  మాజీ  విదేశాంగ శాఖ మంత్రి  యశ్వంత్ సింగ్ ఈ పరిణామాలపై  ఈ విధంగా వ్యాఖ్యానించారు.  ‘గతంలో బీజేపీ ప్రధాని  వాజ్​పేయి  హయాంలో  ఎన్నికల కోసం  దేశ ప్రయోజనాలను  తాకట్టు పెట్టలేదు.  స్వతంత్ర  భారతదేశంలో  అమెరికాకు  పూర్తిగా సరెండర్ అయిన  ప్రధాని ఎవరైనా  ఉన్నారంటే అది మోదీనే’ అని  వ్యాఖ్యానించారు. దేశ ప్రతిష్ట,   ప్రయోజనాల కోసం  ప్రధాని  మోదీ ఇకనైనా మౌనం వీడాలి.

బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులను ఖండించని మోదీ

బంగ్లాదేశ్​లో  హిందువుల  మీద  జరుగుతున్న  దాడులను  మోదీ  నామమాత్రంగానైనా  ఖండించలేదు.  షేక్ హసీనాకు  భారతదేశంలో  ఆశ్రయం కల్పించడంతో  మాట్లాడలేని  పరిస్థితి  ఏర్పడింది.   మరో  పొరుగు దేశం  నేపాల్​తో  కూడా  భారత  సంబంధాలు  బలహీనపడ్డాయి.  కానీ,  మోదీ  మాత్రం  మౌనం వీడడం లేదు.  గతంలో  మన్మోహన్ సింగ్  ప్రధానిగా  ఉన్నప్పుడు  బీజేపీ  శ్రేణులు  అతనిని  ‘మౌన ప్రధాని’ అని  విస్తృత  ప్రచారం  చేశారు.  నేడు  మన్మోహన్ కంటే  ఎక్కువ  మౌనం  ప్రదర్శిస్తున్న  నరేంద్ర మోదీని ‘బలమైన ప్రధాని’ అని  సొంత  మీడియా  ప్రచారం చేస్తుంది.  గతంలో  కాంగ్రెస్  పార్టీ  చైనా కమ్యూనిస్టు  నాయకులతో చర్చలు జరిపితే  దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని  అరిచి గోల పెట్టారు.  కానీ,  నేడు  బీజేపీ,  ఆర్ఎస్ఎస్  నేతలు  అదే  చైనా కమ్యూనిస్టు  పార్టీ  నేతలను ఆహ్వానించి  చర్చలు  చేస్తున్నారు.  

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- నుమాన్ మహమ్మద్, 
ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్