అభ్యర్థుల కంటే 'నోటా'కుఎక్కువ ఓట్లు వస్తే..తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా

అభ్యర్థుల కంటే 'నోటా'కుఎక్కువ ఓట్లు వస్తే..తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా

హైదరాబాద్, వెలుగు:   పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా(నన్ ఆఫ్​ది అబౌ) ఆప్షన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లోక్‌‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా.. ఎన్నికను రద్దు చేయరు. 

నోటా తర్వాత రెండవ స్థానంలో ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో, ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఒక ఊరిలో నోటాకు 1,000 ఓట్లు, ఒక అభ్యర్థికి 550 ఓట్లు, మరో అభ్యర్థికి 400 ఓట్లు వస్తే.. నోటాకు మెజారిటీ వచ్చినా, 550 ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. 

అంతే తప్ప ఎన్నికల వ్యవస్థలో తిరస్కరించే హక్కు లేదు. నోటా అనేది కేవలం నిరసన తెలిపే హక్కు మాత్రమే. అంటే ఓటరుకు ఏ అభ్యర్థీ నచ్చలేదని చెప్పేందుకు ఒక మార్గం మాత్రమే, కానీ అది ఫలితాన్ని తారుమారు చేయదు.  

 
నామినేషన్ తిరస్కరణకు కారణాలివే.. 

ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం నామినేషన్ పత్రం లేకపోతే తిరస్కరిస్తారు. నామినేషన్ లో సంతకాల కోసం కేటాయించిన చోట అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు లేదా ఇద్దరూ సంతకాలు చేయినా.. ఆ నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. 

చట్ట ప్రకారం నిర్దేశిత డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలి. నామినేషన్ పత్రంపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు చేసిన సంతకం సరిగా లేకపోయినా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన స్థానాల్లో ఇతరులు నామినేషన్ దాఖలు చేసినా, మహిళల కోసం రిజర్వ్ చేసిన స్థానాల్లో పురుషులు నామినేషన్ దాఖలు చేస్తే తిరస్కరిస్తారు. 

అలాగే వార్డు మెంబర్ అభ్యర్థి ప్రపోజర్ సంబంధిత వార్డులో ఓటరుగా నమోదు కాకపోతే.. నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఈసీ నిర్దేశిత నమూనాలో ఇద్దరు సాక్షుల ధ్రువీకరణలతోపాటు డిక్లరేషన్ పత్రాన్ని అభ్యర్థి సమర్పించకపోతే నామినేషన్లను సంబంధిత అధికారులు రిజెక్ట్ చేస్తారు.