
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీపావళి పండుగ పురస్కరించుకుని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రీన్ క్రాకర్ల అమ్మకం, వాడకానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 2025 అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మొత్తం నాలుగు రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
అయితే.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని షరతు విధించింది. ఈ మేరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో బాణసంచా నిషేధ నిబంధనలను సుప్రీంకోర్టు సడలించింది. గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో.. అసలు గ్రీన్ క్రాకర్స్ ఎవరు తయారు చేస్తున్నారు..? ఎక్కడ దొరుకుతాయి..? అనే దానిపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మరీ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటీ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం..
మూములు పటాకుల్లానే ఉంటయ్.. కానీ పొగ, శబ్ధం తక్కువ
గ్రీన్ క్రాకర్స్ చూడటానికి మామూలు పటాకుల్లానే ఉంటాయి. కానీ, వాటి నుంచి వచ్చే పొగ, శబ్దాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం వాడే పటాకులు ఎక్కువ స్థాయిలో నైట్రోజన్, సల్ఫర్ వాయువులు విడుదల చేస్తాయి. అదే గ్రీన్ క్రాకర్స్‌లో అయితే ఆ వాయువులు నలభై నుంచి యాభై శాతం వరకు తక్కువ ఉంటాయట. వీటిలో అంటిమోని, లిథియమ్, మెర్క్యురీ, ఆర్సెనిక్, లెడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించరు.
ఈ పటాకుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థాలు వినియోగిస్తారు.. అంతేకాదు ఇవి రంగు రంగుల మెరుపులను వెదజల్లుతాయి. వీటిలో కూడా సేఫ్ వాటర్ రిలీజర్స్(నీరు విడుదల చేసేవి), సేఫ్ మినిమల్ అల్యూమినియం(అల్యూమినియం తక్కువ ఉపయోగించేవి), సేఫ్ థెర్మైట్ క్రాకర్స్, అరోమా పటాకులు.. లాంటి రకాలున్నాయి.
నిజానికి ఇలాంటి క్వాలిటీలున్న క్రాకర్స్ తయారీ అసాధ్యం. కానీ, ఇలాంటి పటాకులు తయారు చేసేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ దృష్టిపెట్టింది. అంతేకాకుండా మామూలు బాణసంచాతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ ధరలు తక్కువగా ఉంటాయంట. ప్రస్తుతం కొన్ని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అస్సాంలో 130 ఏళ్ల నుంచే..
అస్సాంలోని గనక్కుకి అనే గ్రామంలో 1885 నుంచి గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తున్నారు. ఈ బాణసంచాను కాలిస్తే తక్కువ శబ్దంతో పాటు పొగ, కెమికల్స్ చాలా తక్కువ స్థాయిలో విడుదలవుతాయని అక్కడి తయారీదారులు చెప్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి పెద్దగా హాని జరగదంట. అయితే, ప్రస్తుతం ఈ గ్రీన్ క్రాకర్స్ ను మిషన్స్ కాకుండా మనుషులే తయారు చేస్తున్నారు.
మేము తయారు చేసే బాణసంచా గ్రీన్ క్రాకర్స్ లాంటివే. వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు చాలా తక్కువగా ఉంటాయి. మా. ప్రొడక్ట్స్ శాస్త్రవేత్తలు పరీక్షిస్తే ఎంత వరకూ రసాయనాలు వాడామనే విషయం తెలుస్తుంది. అపుడు మాకు కూడా ఉపాధి పెరుగుతుంది. తరతరాలుగా మా కుటుంబం ఇలాంటి క్రాకర్స్ తయారు చేస్తున్నామని చెప్పాడు.
CSIR-NEERI (నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) సంస్థ వీటిని తయారు చేసింది.
వీటి ప్రత్యేకతలు ఏంటంటే : ఇవి మామూలు టపాసుల కంటే చిన్న సైజులో ఉంటాయి. తయారు చేయడానికి తక్కువ ముడి సరుకులు వాడతారు. టపాసులు కాల్చాక ఎక్కువగా బూడిద ఉండదు.
వీటిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని పదార్థాలను కలుపుతారు. దీనివల్ల గాలిలోకి వచ్చే దుమ్ము (కణ పదార్థం), సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటివి తగ్గుతాయి. ఇవి తక్కువ పొగ, తక్కువ శబ్దం చేస్తాయి. మామూలు టపాసుల్లో ఉండే ప్రమాదకరమైన కేమికల్స్ బదులు, వీటిలో తక్కువ ప్రమాదకరమైన పదార్థాలు వాడతారు.
గ్రీన్ క్రాకర్స్ ఎలా ఉంటాయంటే : మామూలు టపాసుల్లో ఉండే కెమికల్స్ కాలుష్యానికి అలాగే ఆరోగ్య సమస్యలకు హాని కలిగిస్తాయి. గ్రీన్ క్రాకర్స్‌లో జియోలైట్, ఐరన్ ఆక్సైడ్ లాంటి పదార్థాలను వాడతారు. వీటితో పాటు రసాయనాల వాడకం తక్కువ ఉంటుంది. దీనివల్ల కాలుష్యం ఎక్కువగా ఉండకుండా తక్కువ ఉంటుంది.
CSIR-NEERI ప్రకారం, గ్రీన్ క్రాకర్స్ కేవలం 30 శాతం తక్కువ వాయు కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్య తేడా.
కణ పదార్థం (PM) అంటే ఏమిటి: గాలిలో ఉండే చిన్న చిన్న దుమ్ము కణాలను కలిపి PM అంటారు. అవి వాటి పరిమాణాన్ని బట్టి PM10, PM2.5, PM1 లాగా వర్గీకరిస్తారు. కణం ఎంత చిన్నగా ఉంటే, అది మన శరీరంలోకి అంత తేలికగా చేరుతుంది.
గ్రీన్ క్రాకర్స్‌లో రకాలు:
SWAS (సేఫ్ వాటర్ అండ్ ఎయిర్ రిలీజర్): ఇవి చాలా చిన్న నీటి తుంపరలను విడుదల చేస్తాయి. ఆ నీటి తుంపరలు గాలిలో ఉండే దుమ్మును పీల్చుకుంటాయి.
సఫాల్ (సేఫ్ మినిమల్ అల్యూమినియం): వీటిలో అల్యూమినియం తక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి చాలా తక్కువ సౌండ్ చేస్తాయి.
స్టార్ (సేఫ్ థర్మైట్ క్రాకర్): వీటిలో పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫర్ ఉండదు. కాబట్టి వీటి నుంచి పొగ చాలా తక్కువగా వస్తుంది.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : ఢిల్లీ-ఎన్‌సిఆర్ బయట నుంచి అక్రమంగా తెచ్చే టపాసులు గ్రీన్ క్రాకర్స్ కంటే ఎక్కువ కాలుష్యాన్ని, నష్టాన్ని కలిగిస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే పండుగను జరుపుకునేందుకు టపాసులను వాడుకోవడానికి అనుమతి ఇస్తూనే, పర్యావరణానికి నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపింది. ఎన్‌సిఆర్ బయట నుంచి ఢిల్లీలోకి తీసుకొచ్చే టపాసుల వాడటంపై సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టింది. అలాగే ఒకవేళ గ్రీన్ క్రాకర్స్ నకిలీవి అని తేలితే, వాటిని తయారు చేసిన కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.