కులగణన చేయకుండా ఎన్నికలేంటి? : బీసీ యువజన సంఘం

కులగణన చేయకుండా ఎన్నికలేంటి? : బీసీ యువజన సంఘం

ముషీరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీ ఎజెండాను ఎత్తుకొని, బీసీల అభిమానం చూరగొంటుంటే రాష్ట్రంలో అన్యాయం చేయడం తగదని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరారు. బుధవారం విద్యానగర్ బీసీ భవన్ వద్ద యువజన సంఘాల నాయకులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. 

జూన్​నెలాఖరు నాటాకి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కులగణన చేయకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు పెంచి, ఎన్నికలు జరపాలని కోరారు. రిజర్వేషన్లను పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.