గురువారం గుజరాత్ లో ఏం జరగబోతుంది.. తుఫాన్ విధ్వంసం చేయబోతుందా

గురువారం గుజరాత్ లో  ఏం జరగబోతుంది.. తుఫాన్ విధ్వంసం చేయబోతుందా

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ బిపర్‌జోయ్ తుఫాను.. ఇప్పుడు గుజరాత్ ను అతలాకుతలం చేస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న అలలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అంతకంతకూ బలపడుతూ వస్తోన్న ఈ తుపాను తీవ్ర తుపానుగా మారబోతోంది. వచ్చే 8 గంటల్లో మరింత బలపడి.. అత్యంత తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఇది జూన్ 15 నాటికి పాకిస్థాన్, ఉత్తర గుజరాత్‌పై అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. తుఫాన్‌ కారణంగా గుజరాత్‌ ప్రభుత్వం ఈనెల 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.


 'బిపార్జోజోయ్' తుఫాను "అత్యంత తీవ్రమైన తుఫాను"గా మారడంతో గుజరాత్ తీరానికి సమీపంలోని గ్రామాల తరలింపు కొనసాగుతుంది. ఇది గురువారం మధ్యాహ్నం కచ్, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రధాని మోడీ జూన్ 12న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. తుపాను పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రం సంసిద్ధత గురించి తెలుసుకోవాలని కోరిన మోడీ.. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర జిల్లాల్లోని తీరం నుంచి 10 కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజలను ఈ రోజు నుంచి తరలించడం ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. తీరానికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 7,500 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలిపారు. దీని కంటే ముందే రెండు జిల్లాల్లో అధికారులు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. కచ్, జామ్‌నగర్, మోర్బి, గిర్ సోమనాథ్, పోర్ బందర్, దేవభూమి ద్వారక జిల్లాలు జూన్ 13-15 మధ్యకాలంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షపాతం, గాలి వేగం 150 కి.మీ వేగంతో పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

జాతీయ, రాష్ట్ర విపత్తు దళాలు ఒక్కొక్కటి డజను బృందాల చొప్పున మోహరించినట్లు, తరలించబడిన వారికి ఆశ్రయం, ఆహారం, మందులను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. అంతేకాకుండా, ఆర్మీ, నేవీ సైతం సహాయ చర్యల నిమిత్తం సిద్ధంగా ఉన్నాయి, భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు తీరంలో గస్తీ తిరుగుతున్నాయి. ముంబైలోని జుహూ బీచ్‌లో జూన్ 12న నీటిలో మునిగి ఓ బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరిని రక్షించారు. మరో ఇద్దరు బాలురు తప్పిపోయారు, వారి కోసం ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముంబయిలో తుపాను కారణంగా అనేక బీచ్‌ల వద్ద అలలు ఎగసిపడటంతో  ముంబయి సముద్రం అల్లకల్లోలంగా మారింది.