దేశానికి ఆయనొక వారెన్‌‌ బఫెట్‌‌

దేశానికి ఆయనొక వారెన్‌‌ బఫెట్‌‌

యంగ్ ఇన్వెస్టర్లకు ఆయన ‘రాకేష్ భయ్యా’, దలాల్ స్ట్రీట్‌‌లో ఒక ‘బిగ్‌‌ బుల్‌‌’, దేశానికి ఆయనొక వారెన్‌‌ బఫెట్‌‌...సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌ రాకేష్ జున్‌‌జున్ వాలా (62) గుండెపోటుతో ఆదివారం తుది శ్వాస విడిచారు.  ‘నేను చనిపో యే రోజు ఉదయం  ట్రేడింగ్, ఇన్వెస్టింగ్  చేసుకోగలగాలి.  సాయంత్ర రెండు డ్రింక్‌‌లు తాగగలిగేలా ఉండాలి. ఆ తర్వాత దేవుడు నన్ను తీసుకెళ్లిపోయినా బాధపడను’ ..గతంలో ఆయనొక ఇంటర్వ్యూలో అన్న మాటలివి. కానీ, ఆయన మరణం అతను అనుకున్న విధంగా లేకపోవడం బాధాకరం. గుండె, కిడ్ని, డయాబిటిస్‌‌ సంబంధిత వ్యాధులతో కొన్నాళ్ల నుంచి బాధపడుతున్న జున్‌‌జున్‌‌వాలా  ఆదివారం తెల్లవారు జామున మరణించారు. 

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశ ఫైనాన్షియల్ మార్కెట్‌‌లో తనదైన ముద్ర వేసిన రాకేష్ జున్‌‌జున్‌‌వాలా  ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారు. ఎవ్వరూ నమ్మని టైమ్‌‌లోనే  దేశ స్టాక్​ మార్కెట్లపై ఆయన ఎనలేని నమ్మకం ఉంచారు. అద్భుతాలు చేశారు. ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ ఆఫీసర్‌‌‌‌ కొడుకు అయిన రాకేష్ జున్‌‌జున్‌‌వాలా, స్వతహాగా ఎదిగారు. కేవలం రూ. 5000 లతో 1985 లో స్టాక్ మార్కెట్‌‌లోకి  ఎంటర్ అయ్యారు. చనిపోయే నాటికి ఆయన సంపద రూ. 44 వేల కోట్లకు చేరుకుంది.

ఫోర్బ్స్‌‌ లిస్ట్‌‌ ప్రకారం, దేశంలోని36 వ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌‌ అయిన రాకేష్ జున్‌‌జున్‌‌వాలా తన  పేరులోని మొదటి రెండు పదాలు, ఆయన భార్య రేఖా పేరులోని చివరి రెండు పదాలతో  రేర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ను స్టార్ట్‌‌ చేసి, తన పోర్టుఫోలియోని మరింత పెంచారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.   కాలేజ్‌‌ టైమ్‌‌లోనే తన ట్రేడింగ్ జర్నీని జున్‌‌జున్‌‌వాలా మొదలుపెట్టారు. నెమ్మదిగా దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌‌‌‌గా ఎదిగారు. ఆయన చెప్పిన షేర్లలో గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేవారు లక్షల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు.

రెండింటిలోనూ ఆయన దిట్టే..

ట్రేడింగ్‌‌, ఇన్వెస్టింగ్.. రెండింటిని సమర్ధవంతంగా చేసిన వారిలో రాకేష్ జున్‌‌జున్ వాలా ముందుంటారు. ‘ఫటాఫట్‌‌..ధనాధన్‌‌’ అనే వెర్షన్‌‌లోనూ జున్‌‌జున్‌‌వాలాను చూడొచ్చు. అలానే టైటాన్ లాంటి క్వాలిటీ షేరులో ఇన్వెస్ట్‌‌ చేసి కొన్నేళ్ల పాటు హోల్డ్ చేయడాన్ని కూడా చూడొచ్చు. ఆయన దృష్టిలో ట్రేడింగ్ అనేది క్యాపిటల్‌‌ సమకూర్చుకోవడానికి ఓ సాధనం మాత్రమే. అదే ఆ క్యాపిటల్‌‌ను పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇన్వెస్టింగ్ చేయాలని జున్‌‌జున్‌‌వాలా సలహాయిస్తారు.

దేశంపై ఆయనకు మమకారం ఎక్కువ. మార్కెట్‌‌లు పడుతున్నా, దేశం వృద్ధి బాట పడుతుందని, మార్కెట్‌‌ మళ్లీ లేస్తుందని ఎక్కువగా నమ్మేవారు. యూఎస్ గ్రోత్‌‌పై వారెన్‌‌ బఫెట్ ఎలా నమ్మకముంచారో అలానే రాకేష్ జున్‌‌జున్‌‌ వాలా కూడా ఇండియా గ్రోత్‌‌ స్టోరీని ఎక్కువగా నమ్మారు. క్యాపిటల్‌‌పై నిలకడగా  18–21 శాతం రిటర్న్‌‌ సంపాదించగలిగే వాళ్లు  రాజులు లేదా మహారాజుల కంటే తక్కువేమి కాదని ఆయన అంటుంటారు.    

అప్పు చేసి మరీ..

రాకేష్ జున్‌‌జున్‌‌వాలా తన మొదటి సక్సెస్‌‌ను టాటా పవర్ షేరు ద్వారా రుచి చూశారు. ఆ తర్వాత వరస విజయాలతో క్యాపిటల్‌‌ను సమకూర్చుకోగలిగారు. వరస విజయాలతో దూసుకుపోయిన జున్‌‌జున్ వాలాకు ఆ తర్వాత రెండేళ్లు గడ్డు కాలంగా మారాయని చెప్పాలి. ఇంటి ఖర్చులను అతని తండ్రి చూసుకోవడంతోనే నష్టాలొచ్చినా నిలబడగలిగానని జున్‌‌జున్‌‌వాలా ఓ ఇంటర్వ్యూలో  పేర్కొన్నారు. సేసా గోవా (వేదాంత) పై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడంతో జున్‌‌జున్‌వాలా తిరిగి గాడిలో పడగలిగారు. తన ఫ్రెండ్స్‌‌ ఇచ్చిన సలహాపై ఈ షేరులో ఇన్వెస్ట్ చేశానని ఆయన చెబుతుంటారు.  1990 టైమ్‌‌లో జున్‌‌జున్‌‌వాలా భారీ రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి.

వీపీ సింగ్‌‌ నాయకత్వంలోని జనతాదళ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మొదటి బడ్జెట్‌‌పై నమ్మకం ఉంచారు. తన ఇంటిని సైతం తనఖా పెట్టి ఇన్వెస్ట్ చేశారు. ఈ బడ్జెట్‌‌ వ్యాపారాలకు, మార్కెట్‌‌కు ప్రయోజనం చేకూరేలా ఉంటుందని ఆయన  నమ్మారు. వీపీ సింగ్ బిజినెస్‌‌లను బాగా అర్థం చేసుకుంటాడని, అందుకే ఆయన మార్కెట్‌‌ను ఇబ్బంది పెట్టేలా బడ్జెట్‌‌ తీసుకొస్తాడని అనుకోలేదని జున్‌జున్‌వాలా చెబుతుండేవారు. ఆయన రిస్క్‌‌కు ఫలితం దక్కింది. తన ఇంటిని తిరిగి పొందడమే కాకుండా అతని భార్య ఎప్పటి నుంచో అడుగుతున్న ఏసీని కూడా ఆయన కొనివ్వగలిగారు. 

ఒకప్పుడు ‘బేరే’

రాకేష్ జున్‌‌జున్‌వాలా ముందునుంచి బుల్‌‌ (మార్కెట్ పెరుగుతుందని నమ్మేవారు) ఇన్వెస్టర్ కాదు. 1991–92 టైమ్‌‌లో  హర్షద్ మెహతా దలాల్ స్ట్రీట్‌‌లో బిగ్‌‌బుల్‌‌గా కొనసాగారు. అప్పుడు మను మానెక్‌‌, అజయ్ కయాన్‌‌, హేమెంద్ర కొఠారి వంటి బేర్స్‌‌ (మార్కెట్ పడుతుందని నమ్మేవారు) తో జున్‌‌ జున్‌‌వాలా జట్టు కట్టారు. హర్షద్‌‌ మెహతా దెబ్బకు మార్కెట్‌‌లు పెరుగుతున్నా, వీరు తమ షార్ట్ సెల్లింగ్స్‌‌( షేర్లను మొదట అమ్మడం) నుంచి బయటకు రాకపోవడాన్ని గమనించాలి.

చివరికి వారి ఓపిక లాభాన్నిచ్చిందని చెప్పాలి. హర్షద్‌‌ మెహతా స్కామ్ బయటపడ్డాక మార్కెట్‌‌లు కుప్పకూలాయి. ఆ టైమ్‌‌లో జున్‌‌జున్‌వాలా సుమారు రూ. 30 కోట్లు సంపాదించారు. అప్పటి నుంచి మార్కెట్‌‌లో వాల్యుయేషన్ తక్కువగా ఉన్న, గ్రోత్‌‌కు అవకాశం ఉన్న షేర్లను గుర్తించి లాంగ్‌‌టెర్మ్‌‌ ఇన్వెస్టింగ్‌‌  చేయడం స్టార్ట్ చేశారు జున్‌‌జున్‌వాలా. 

జున్‌‌‌‌ జున్‌ వాలా షేర్లు..

జున్‌‌ జున్‌‌ వాలాకు పబ్లిక్‌‌గానే 32 కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. తన కెరీర్ స్టార్టింగ్‌‌లో ఐటీ, టెక్నాలజీ షేర్లపై ఇన్వెస్ట్ చేసి ఆయన చేతులు కాల్చుకున్నారు కూడా. ఐటీ షేర్లు పడుతున్నా, డాట్‌‌కామ్‌‌ బబుల్‌‌ టైమ్‌‌లో ఎన్‌‌ఐఐటీ ఆయన ఇన్వెస్ట్ చేశారు. భారీగా నష్టపోయారు. టాటా గ్రూప్ కంపెనీలపై రాకేష్ జున్‌‌జున్‌వాలా ఎక్కువ నమ్మకం ఉంచారు. 2002–05 టైమ్‌‌లో టైటాన్ షేరులో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత తన వాటాను పెంచుకుంటూ వచ్చారు.

ప్రస్తుతం టైటాన్‌‌లో జున్‌‌జున్‌‌వాలా ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ రూ. 11 వేల కోట్లుగా ఉంటాయి. టాటా గ్రూప్ షేర్లయిన టాటా మోటార్స్‌‌, ఇండియన్ హోటల్స్‌‌, ర్యాలిష్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్‌‌లో కూడా ఆయనకు వాటాలు ఉన్నాయి. తాజాగా ఆకాశ ఎయిర్‌‌‌‌లో  ప్రమోటర్‌‌‌‌గా మారారు. స్టార్‌‌ హెల్త్‌‌, నజరా టెక్​, జూబిలియెంట్ ఫార్మోవ, జూబిలియెంట్ ఇంగ్రీవియా, క్రిసిల్‌‌, కరూర్ వైశ్యా బ్యాంక్‌‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌‌ వంటి కంపెనీల్లో ఆయనకు వాటా ఉంది. 

జున్ జున్ వాలా కోట్స్...

1. ప్రపంచాన్ని మీకు నచ్చినట్లు కాకుండా ఎలా ఉందో అలానే చూడండి.

2. నష్టాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ లైఫ్ లో నష్టాలు కూడా ఒక భాగమే. 

3. మార్కెట్ ను గౌరవించండి. ఓపెన్ మైండ్ తో ఉండండి. రిస్క్ ఎంత ? ఎప్పుడు నష్టాల నుంచి బయటకు రావాలి ? వంటివి ముందుగానే తెలుసుకోండి. బాధ్యతాయుతంగా ఉండండి. 

4.పోటీ తత్వాన్ని పెంచుకోండి. చెడును మంచితో స్వీకరించండి.

 

రాకేష్ జున్‌‌జున్‌‌వాలా ఎవరికీ లొంగనివారు. ఫైనాన్షియల్ వరల్డ్‌‌లో తనదైన  ముద్ర వేశారు. దేశ వృద్ధిపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. జున్‌జున్‌వాలా తుది శ్వాస విడవడం బాధ కలిగించేది. ఆయన కుటుంబానికి, ఫాలోవర్లకు ఇదే నా ప్రగాడ సానుభూతి. ఓం శాంతి.   ‑ ప్రధాని నరేంద్ర మోడీ

రాకేష్ జున్‌జున్‌వాలా ఇక లేరు. ఆయనొక ఇన్వెస్టర్‌‌, దైర్యంగా రిస్క్‌ తీసుకోగలిగేవారు, స్టాక్‌ మార్కెట్‌ను బాగా అర్థం చేసుకోగలిగేవారు, క్లియర్‌‌గా కమ్యూనికేట్ చేయగలిగేవారు.. తనదైన మార్గంలో అతనొక లీడర్‌‌.  ఆయనతో జరిపిన మధురమైన సంభాషణలు గుర్తున్నాయి. దేశ సామర్ధ్యంపైన, శక్తిపైన బలమైన నమ్మకం ఉంచారు. నివాళులు.  ‑నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్‌‌

దేశంపైన, దేశ సామర్ధ్యంపైన  రాకేష్ జున్‌జున్‌వాలా  నమ్మకం ఉంచారు. ఈ ఆలోచనా దృక్పథంతోనే తన జీవితంలో సాహసోపేతమైన చాలా నిర్ణయాలను తీసుకోగలిగారు. ఆయన మరణం తీరని లోటు  ‑ఎన్‌ చంద్రశేఖరన్‌, టాటా సన్స్ చైర్మన్‌

లెజండరీ ఇన్వె స్టర్‌ అకస్మాత్తు గా మరణించడం చాలా బాధించింది. స్టాక్‌ మార్కెట్‌ని నమ్మేలా ఒక జనరేషన్ మొత్తాన్ని తన ఆలోచనలతో జున్‌జున్‌వాలా ఇన్‌స్పైర్ చేశారు. ఆయన్ని మిస్‌ అవుతాం. ఇండియా ఆయన్ని మిస్ అవుతుంది. కానీ, ఆయన్ని ఎప్పటికీ మరిచిపోము. రెస్ట్‌ ఇన్‌ పీస్‌  ‑ గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్‌