
హైదరాబాద్, వెలుగు: సోలార్, విండ్ వంటి రెన్యువబుల్ ఎనర్జీ ప్రొడక్టుల ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా (ఐఎంఐ) రెండు రోజులపాటు నిర్వహించే రెన్యూఎక్స్ ఎనిమిదో ఎడిషన్ రెన్యూవబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్‌పో శుక్రవారం ఇక్కడి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి దక్షిణ భారతదేశంలోని పునరుత్పాదక ఇంధన ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఎక్స్‌పోకు 150కిపైగా దేశీయ, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు వచ్చారు. వీళ్లు తమ ప్రొడక్టులను, టెక్నాలజీలను ప్రదర్శించారు. మొదటిరోజే 5000 మందికి పైగా సందర్శకులు వచ్చారని నిర్వాహకులు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జానయ్య మాట్లాడుతూ 2070 నాటికి నెట్‌జీరో టార్గెట్లను చేరుకోవాలని అన్నారు. ఇందుకు భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రెండూ మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
దేశీయ రంగంలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు తక్కువగా వ్యాప్తి చెందడం పట్ల జానయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించడానికి మెరుగైన ప్రోత్సాహకాలు, నెట్ మీటరింగ్ మెకానిజమ్‌లతో సహా భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను జానయ్య ప్రశంసించారు. ఇంటిగ్రేటర్లు, డెవలపర్‌లు ఈ ప్రోత్సాహకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని రూఫ్‌టాప్ సోలార్‌కు వేగంగా మారడానికి వీలు కల్పించాలన్నారు.