ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి

ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి

మోత్కూరు, యాదగిరిగుట్ట, వెలుగు : వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన తండ్రీకొడుకులు చనిపోయారు. కాగా, తండ్రి మృతదేహం లభించకపోవడంతో ఫైర్​సిబ్బంది 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మోటార్లతో బావిలో నీటిని తోడి డెడ్ బాడీని బయటకు తీశారు. గ్రామస్తుల కథనం ప్రకారం...యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రాయిపల్లికి చెందిన బోడ సురేశ్​(37)భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి ఎల్లమ్మ పండుగకని గురువారం మోటకొండూర్ మండలంలోని చాడ గ్రామంలో ఉన్న తోడల్లుడు సకినాల రవి ఇంటికి వచ్చాడు. 

శుక్రవారం మధ్యాహ్నం సురేశ్​తన చిన్న కొడుకు సాయి (11)ని తీసుకుని ఊరు పక్కనున్న వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. కొడుకును భుజాల మీద ఎక్కించుకొని సురేశ్ ఈత కొడుతుండగా పిల్లవాడు భయపడి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ కేకలు పెడుతూ మునిగిపోయారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు విని బావి దగ్గరకు వచ్చేసరికి కనిపించలేదు. కొందరు బావిలోకి దూకి గాలించగా కొడుకు డెడ్ బాడీ దొరికింది. సురేశ్​డెడ్​బాడీ దొరక్కపోవడంతో పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆలేరు ఫైర్ సిబ్బంది గొలుసు కొక్కాలతో గాలించినా ఫలితం కనిపించలేదు. చివరకు రెండు మోటార్లతో బావిలో నీటిని తోడగా 5 గంటల తర్వాత డెడ్ బాడీ కనిపించింది. సురేశ్​తాపీ మేస్త్రీ కాగా, సాయి ఆత్మకూరు హైస్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. కాగా, సురేశ్​ఈతకు వెళ్లే ముందు కల్లు తాగాడని అంటున్నారు. 

తండ్రితో కలిసి వెళ్లిన మరో బాలుడు..

బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో ఈత నేర్చుకునేందుకు తండ్రితో పాటు వెళ్లిన ఓ బాలుడు నీట మునిగి చనిపోయాడు. గ్రామానికి చెందిన చేపూరి గంగయ్య కొడుకు మణితేజ (11) ఏడో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు ఇవ్వడంతో తనకు ఈత నేర్పించాలని తండ్రిని కోరాడు. దీంతో శుక్రవారం గంగయ్య, మణితేజ కలిసి గ్రామానికి పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లారు. 

కొద్దిసేపు ఈత నేర్పించిన తర్వాత గంగయ్య పక్కకు వెళ్లాడు. ఈత కొడుతున్న మణితేజ బావి మధ్యలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై పృథ్వీధర్​ ‌వచ్చి బావిలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో మోటార్ల సాయంతో బయటకు తోడించారు. గజ ఈతగాళ్లతో నాలుగు గంటలపాటు గాలించగా బాలుడి డెడ్‌బాడీ దొరికింది. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు 
చేసినట్లు ఎస్సై తెలిపారు.