KL Rahul: ఐపీఎల్‌లో కెప్టెన్సీ పెద్ద తలనొప్పి.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 నెలలు ఆడినా అలసిపోను: రాహుల్

KL Rahul: ఐపీఎల్‌లో కెప్టెన్సీ పెద్ద తలనొప్పి.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 నెలలు ఆడినా అలసిపోను: రాహుల్

ఎంత బాగా ఆడినా కొంతమందికి గుర్తింపు దక్కదు. జట్టును ఒత్తిడిలో ఆదుకున్నా.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడినా.. ఒకటి రెండు మ్యాచ్ లో విఫలమైతే విమర్శలు వస్తాయి. బాగా ఆడినప్పుడు ప్రశంసలు, చెత్త ప్రదర్శనకు విమర్శలు రావడం సహజమే. క్రికెట్ ని విపరీతంగా అభిమానించే మన దేశంలో  ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. అతను బాగా ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ గుర్తించకపోగా.. విఫలమైతే మాత్రమే విమర్శిస్తారు. భారత క్రికెట్ లోనే కాదు ఐపీఎల్ లోనూ రాహుల్ కి ఇదే పరిస్థితి.
 
ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్న రాహుల్.. ఐపీఎల్ లో కెప్టెన్సీ చేయడం ఎంత కష్టమనే విషయం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ తో ఐపీఎల్ పోలుస్తూ ఏది కష్టమో తన అభిప్రాయాన్ని తెలిపాడు. రాహుల్ మాట్లాడుతూ.. " ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేయడం కష్టం. నాకు కష్టంగా అనిపించింది ఏంటంటే.. పదే పదే మీటింగ్స్.. ప్లేయర్ల ఆటపై సమీక్షలు ఉంటాయి. జట్టు ఫ్రాంచైజీకి   వివరణలు ఇవ్వాలి. పది నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడడం కంటే ఐపీఎల్ లో ఎక్కువగా మానసికంగా, శారీరకంగా అలసిపోయానని గ్రహించాను.  

కోచ్‌లు, కెప్టెన్‌లను ఎప్పుడూ చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. మీరు ఈ మార్పు ఎందుకు చేసారు? అతను XIలో ఎందుకు ఆడాడు? ప్రత్యర్థి జట్టుకు 200 పరుగులు చేసినప్పుడు మనం కనీసం 120 పరుగులు కూడా ఎందుకు చేయలేకపోయాము.. ప్రత్యర్థి జట్టు ఎక్కువగా ఎందుకు స్పిన్ బౌలింగ్ ఆడిస్తున్నారు.. కానీ అంతర్జాతీయ క్రికెట్‌ కు వచ్చేసరికి అలాంటి పరిశీలన ఉండదు. ఏడాది పొడవునా ఈ ప్రశ్నలు మమ్మల్ని ఎప్పుడూ అడగరు. ఎందుకంటే కోచ్‌లకు ఏమి జరుగుతుందో తెలుసు. మీరు కోచ్‌లు, సెలెక్టర్లకు మాత్రమే జవాబుదారీగా ఉంటారు". అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే షోలో జతిన్ సప్రుతో జరిగిన మీటింగ్ లో రాహుల్ చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | Shubman Gill: ఆసుపత్రి నుండి గిల్ డిశ్చార్జ్.. టీమిండియా కెప్టెన్ రెండో టెస్ట్ ఆడతాడా..?

మూడు సీజన్ల పాటు లక్నో సూపర్ జయింట్స్ కు కెప్టెన్సీ చేసిన రాహుల్ గత సీజన్ లో ఫ్రాంచైజీతో విడిపోయాడు. 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో 13 మ్యాచ్ లాడిన రాహుల్ 539 పరుగులతో అదరగొట్టాడు.   రాహుల్ కెప్టెన్సీ వద్దనడంతో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ అప్పగించింది. 2025 లో అద్భుతంగా రాణించిన రాహుల్ ను ఢిల్లీ 2026 ఐపీఎల్ సీజన్ కు రిటైన్ చేసుకుంది. రాహుల్ కామెంట్స్ తో భవిష్యత్ లో ఐపీఎల్ కెప్టెన్సీ తీసుకునే ఆలోచనలో లేనట్టు కనిపిస్తుంది.