రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆదివారం (నవంబర్ 16) గిల్ కోల్‌కతాలోని ఆసుపత్రి నుండి గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. డాక్టర్లు గిల్ కు మూడు నుంచి నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో రెండో టెస్టుకు ఈ టీమిండియా కెప్టెన్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. గౌహతి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గిల్ ఆడతాడా లేదా అనే విషయంలో జట్టు యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. గౌహతి టెస్టుల్పో గెలిస్తేనే ఇండియా సిరీస్ సమం చేసుకుంటుంది. లేకపోతే 0-2 తేడాతో సిరీస్ కోల్పోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వెనకపడుతుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిజియో అంచనా తర్వాతే నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేశాడు. గిల్ అందుబాటులో లేకపోతే తుది జట్టులోకి దేవదత్ పడిక్కల్‌ను తీసుకునే అవకాశం ఉంది. తొలి టెస్టులో సాయి సుదర్శన్ స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన వాషింగ్ టన్ సుందర్ తొలి టెస్టులో టీమిండియా టాప్ స్కోరర్. దీంతో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
►ALSO READ | Ravindra Jadeja: దూసుకెళ్తున్న జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్ర
కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెడ పట్టేయడంతో గిల్ బ్యాటింగ్ చేయలేక గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు.ఆ తర్వాత గిల్ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరాడు. త్వరగా కోలుకున్న గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..?
శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో భాగంగా గిల్ కు గాయమైంది. వాషింగ్ టన్ సుందర్ కు ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్.. మూడో బంతికే ఫోర్ కొట్టి పరుగుల ఖాతా తెలిచాడు. బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడడంతో గిల్ మెడ నొప్పితో ఇబ్బందిగా కనిపించాడు. రాహుల్ తో కాసేపు చర్చించిన ఈ టీమిండియా కెప్టెన్ గ్రౌండ్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరాగాల్సి వచ్చింది. గిల్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరడంతో అతని స్థానంలో పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు.
