హాలియా, వెలుగు: ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడిన యువకుడిని నలుగురు యువకులు కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన శివ అనే యువకుడు మధ్యాహ్నం పెద్దదేవులపల్లి సమీపంలోని ఎడమ కాల్వ కట్ట వద్దకు వెళ్లాడు. అదే సమయంలో శివ ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలో జారీ పడిపోయాడు.
ఈ క్రమంలో అటుగా వెళుతున్న పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన మేకల సతీష్, అనిల్ కుమార్, సంతోష్, వేణు అనే నలుగురు యువకులు కాలువలో కొట్టుకుపోతున్న శివను గమనించారు. వెంటనే నలుగురు యువకులు కలిసి నీటిలో మునిగిపోతున్న శివను బయటకు లాగారు. శివను రక్షించిన నలుగురు యువకులను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
