తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం (నవంబర్ 17) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘తెలంగాణ ప్లాట్‌‌ఫామ్ -ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు-2025’పై చర్చించిన అనంతరం బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్​వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. ఇకపై గిగ్​వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తుంది.

గిగ్ వర్కర్స్ బిల్లులోని విశేషాలు ఇవీ..!

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం రవాణా (మొబిలిటీ), డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి-12 గంటల చొప్పున  వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్‌ఫామ్‌లు 20% నుంచి 30% వరకు కమిషన్‌గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గిగ్​వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకుండాపోవడం ప్రధాన సమస్యగా ఉంది.  

 తాజా బిల్లులో  గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ -ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత,  సంక్షేమ బోర్డు’ పేరుతో  ప్రత్యేక బోర్డు  ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. 

అగ్రిగేటర్లకు (ఫ్లాట్​ఫామ్ లు) చెల్లించే సొమ్ములో 1-–2% వాటాను గిగ్​ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సీఎస్​ఆర్​ఫండ్స్​, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్‌ఫామ్‌ల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్-టైమ్ ‘వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ (డబ్ల్యుఎఫ్​ఎఫ్​ వీఎస్​)’  అందుబాటులోకి తేనున్నారు. 

స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబర్, ఓలా వంటి ప్లాట్‌ ఫామ్‌లు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్​టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్​ చేయడం.. లాంటి  సమస్యల పరిష్కారానికి  గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు. 100 మందికి పైగా కార్మికులు ఉండే ప్రతి పెద్ద ప్లాట్‌ఫామ్‌లో  ‘అంతర్గత వివాద పరిష్కార కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.

►ALSO READ | కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ నాలుగు ముక్కలు

ఈ కమిటీల ద్వారా పరిష్కారం లభించకపోతే, పైస్థాయిలో అప్పీలేట్ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. కార్మికులు లేదా ప్లాట్‌ఫామ్‌లు గ్రీవెన్స్ అధికారులు ఇచ్చిన నిర్ణయంపై సంతృప్తిచెందకపోతే వారు అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ అథారిటీ స్వతంత్రంగా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది. తద్వారా కార్మికులకు న్యాయపరమైన భరోసా దక్కుతుంది.

చట్టం అమల్లోకి వస్తే ఆయా ప్లాట్‌‌ఫామ్‌‌లు ఇకపై ఉద్యోగులను అకారణంగా తొలగించలేవు. ఎవరైనా ఉద్యోగిని తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. గతంలో ప్లాట్​ఫామ్​లు గిగ్ వర్కర్ల అకౌంట్లను ఒక్కసారిగా నిలిపివేసేవి. దీనివల్ల కార్మికులు ఉన్నఫళంగా రోడ్డునపడేవారు. తాజా బిల్లులో కస్టమర్ భద్రతకు ముప్పు కాని సందర్భాల్లో.. ఏ వర్కర్‌‌నైనా తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలనే నిబంధన పెట్టారు.

పని కేటాయింపు, తొలగింపు.. తదితర అంశాల్లో వివక్ష లేకుండా ఉండేందుకు, ప్లాట్‌‌ఫామ్‌‌లు ఉపయోగిస్తున్న అల్గారిథమ్‌‌లు పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గిగ్ వర్కర్లకు పని కేటాయింపులు, బోనస్‌‌లు, రేటింగ్‌‌లు, అకౌంట్ సస్పెన్షన్‌‌లు పూర్తిగా సాఫ్ట్‌‌వేర్ అల్గారిథమ్‌‌పై ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో వివక్ష, అన్యాయానికి తావులేకుండా బిల్లులో ‘అల్గారిథమ్ ట్రాన్సపరెన్సీ’ని తప్పనిసరి చేస్తున్నారు. దీని ద్వారా కార్మికులు తమ పనిపై ప్రభావం చూపే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కు పొందుతారు.

సర్వే నిర్వహించి.. సమస్యలు తెలుసుకొని..!

గిగ్​వర్కర్ల  బిల్లు రూపకల్పన నుంచి ఆమోదం వరకు ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు వెళ్తున్నది. ముందుగా రాష్ట్రంలో 1,300 మంది గిగ్ వర్కర్లపై సర్వే నిర్వహించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా బిల్లులో పలు అంశాలు పొందుపరిచింది. 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల సంఘాలు, నిపుణులు, న్యాయవేత్తలతో ఆరుసార్లు సంప్రదింపులు చేపట్టి.. పలు మార్పులు చేర్పులు చేసింది. 

న్యాయశాఖ పరిశీలన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి మే 19 వరకు బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 66 సూచనలు, అభ్యంతరాలు అందగా.. వీటిలో చాలా అంశాలను బిల్లులో పొందుపరిచారు. కర్నాటక, జార్ఖండ్, రాజస్తాన్​లో గిగ్​వర్కర్ల చట్టాలను తెచ్చినా.. ఇంత సమగ్రంగా లేదని ఈ రంగలోని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు.