న్యూఢిల్లీ: ఢిల్లీ కారు పేలుడు నిందితులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పేలుళ్ల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. పాతాళంలో ఉన్నా వేటాడి పట్టుకొచ్చి మరీ కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. సోమవారం (నవంబర్ 17) హరియాణాలోని ఫరిదాబాద్‌లో జరిగిన నార్తరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రచర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు.
2025, నవంబర్ 11న భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలువురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి సోమవారం (నవంబర్ 17) మరో వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
►ALSO READ | ఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో కీలక పరిణామం.. సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఫ్రెండ్ అరెస్ట్
జమ్మూకాశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడు, ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో డానిష్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాంబ్ పేలుడు కోసం ఉమర్ నబీకి డానిష్ సాంకేతిక సహయం అందించాడని.. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద దాడులకు సహకరించాడని అధికారులు వెల్లడించారు.
